AI, Data Science In 2025 | ఏఐ, డేటా సైన్స్‌ కోర్సుల్లో చేరతారా? దేశంలో టాప్‌ యూనివర్సిటీలు ఇవిగో!

AI, Data Science In 2025 | ఏఐ, డేటా సైన్స్‌ కోర్సుల్లో చేరతారా? దేశంలో టాప్‌ యూనివర్సిటీలు ఇవిగో!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్(Data Science) వంటి కోర్సులు యువతకు అసాధారణమైన కెరీర్‌ అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ఈ కోర్సులు అందిస్తోన్న టాప్‌ వర్సిటీలేవో చూద్దామా!

Eenadu icon
By Education News Team Published :14 Apr 2025 15:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జాబ్‌ మార్కెట్లో(Job Market) కొత్త ట్రెండ్స్‌ చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా అనేక ఉద్యోగాలు మాయమైపోతుంటే.. అంతకుమించి కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా కొత్త నైపుణ్యాలు నేర్చుకొనే వారికే విపరీతమైన గిరాకీ ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్(Data Science) వంటి కోర్సులు యువతకు అసాధారణమైన కెరీర్‌ అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో, ప్రపంచస్థాయిలో ఈ కోర్సులను అందిస్తోన్న టాప్‌ యూనివర్సిటీల జాబితాను ఓసారి పరిశీలిస్తే..

2025 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌(QS Rankings) ఆధారంగా భారత్‌లో ఏఐ, డేటా సైన్స్‌ కోర్సుల్ని అందిస్తోన్న టాప్‌-7 విశ్వవిద్యాలయాల జాబితాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ సైన్స్‌ (IISc), బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా.. ఐఐటీ బాంబే(IITB), ఐఐటీ - దిల్లీ(IITD), ఐఐటీ- కాన్పుర్‌(IITK), ఐఐటీ- ఖరగ్‌పుర్‌(IIT-KGP), ఐఐటీ మద్రాస్‌(IITM) వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ టెక్నాలజీ (VIT), వెల్లూరు ప్రముఖంగా ఉన్నాయి.

అలాగే, అంతర్జాతీయంగా ఏఐ, డేటా సైన్స్‌ కోర్సులు అందిస్తోన్న టాప్‌ యూనివర్సిటీల్లో మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT) అగ్రస్థానంలో ఉండగా.. కార్నెగీ మెల్లన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్కెలీ(UCB), నాన్యాంగ్‌ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ (NTU), సింగపూర్‌ ఉన్నాయి. 

ఏఐ, డేటాసైన్స్‌ కోర్సులతో ఏ ఉద్యోగాలు వస్తాయ్‌?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ద్వారా AI ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, ఏఐ కన్సల్టెంట్‌ వంటి పలు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొని ఉత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. మరోవైపు, డేటా సైన్స్ కోర్సులను అభ్యసించడం ద్వారా డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్, డేటా ఇంజినీర్‌ వంటి అవకాశాలు అందుకోవచ్చు. ఈ రెండు రంగాల్లో నైపుణ్యాలు సాధించిన వారికి విస్తృతమైన కెరీర్‌ అవకాశాలు ఉంటున్నాయి. ఏఐ టెక్నాలజీని ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, తయారీ పరిశ్రమ, ఆటోమొబైల్, వినోద రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. రోగ నిర్థరణ, పర్యవేక్షణ, డేటా విశ్లేషణ లాంటి అప్లికేషన్లు వ్యాపారాలను పూర్తిగా మార్చేస్తున్న క్రమంలో నిరంతరం విస్తరిస్తున్న ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఈ కోర్సులు యువతకు అపారమైన అవకాశాలు అందించనున్నాయి.