Tips for High Salary Jobs | ఐటీ కంపెనీల్లో అధిక వేతనంతో జాబ్ రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి!
జాబ్ మార్కెట్లో పోటీ నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగం సాధించడం, దాన్ని నిలుపుకోవడం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో అధిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్ మీకోసం..
By Education News Team
Published : 23 Jan 2024 17:34 IST
https://results.eenadu.net/news.aspx?newsid=230125
IT job tips | ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం శరవేగంగా మారుతోంది. కాలంతో పోటీ పడుతోన్న సాంకేతిక విప్లవం జాబ్ మార్కెట్(Job Market) దశ, దిశను నిర్దేశిస్తోంది. దీంతో మార్కెట్ అవసరాల్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకొంటూ.. తగిన నైపుణ్యాలు (Skills) నేర్చుకున్నవారే కెరీర్‌లో దూసుకుపోతున్నారు. నేటి జాబ్ మార్కెట్లో విపరీతమైన పోటీని సైతం తట్టుకొని ఐటీ కంపెనీల్లో ఆకర్షణీయమైన వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. అయితే, ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. వ్యూహాత్మక ప్రణాళిక, నిరంతరం తమను తాము అప్‌డేట్ చేసుకోగలిగే నేర్పుతోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం వారు సూచిస్తున్న కొన్ని చిట్కాలు మీ కోసం..
- మూస పద్ధతులకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఏ రంగంలోనైనా నలుగురిలా కాకుండా వైవిధ్యంగా, కళాత్మకతతో చేసే పని వారికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. నిరంతర అధ్యయనం, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే సృజనాత్మకంగా ఆలోచించగలరు. ఐటీ రంగంలో పనిచేసేవారైతే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం అత్యంత అవసరం. అందువల్ల ఈ రంగంలో అధిక వేతనంతో కొలువు సాధించాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణపొందుతున్న ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ట్రెండింగ్ సాంకేతిక టెక్నాలజీలతో పాటు ప్రోగ్రామింగ్ భాషల్లో ప్రావీణ్యత సాధించడంపై ఫోకస్ పెట్టాలి.
- మీరు ఏ రంగంలోనైతే పనిచేయాలనుకొంటున్నారో.. దానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ప్రస్తుతం మీరు పనిచేస్తున్న చోట స్వీకరించిన సవాళ్లు వంటివి మీ ప్రొఫైల్‌ను మరింత సమర్థంగా మారుస్తాయి. అలాగే, పలు ఈవెంట్‌లకు హాజరుకావడం, నిపుణులతో సంబంధాలను కొనసాగించడం వంటివి మీ నెట్‌వర్క్‌ను పెంచడమే కాదు.. మీలో నూతనోత్సాహాన్ని తీసుకొస్తాయి. తద్వారా మీ అవకాశాలు మరింతగా మెరుగుపడేందుకు దోహదపడతాయి.
- ఏ ఉద్యోగంలోనైనా కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ చాలా ప్రధానం. ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా పనిచేసే చోట మీ బలం పెరుగుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించే సామర్థ్యం, టీమ్‌ను లీడ్ చేయగలగడం, ఏదైనా అంశాన్ని నలుగురికీ కమ్యూనికేట్ చేసి అవసరమైతే దానిపై చర్చించడం వంటి స్కిల్స్ మీ కెరీర్‌కు ఓ ఇంధనంలా పనిచేస్తాయి.
- మీ రెజ్యుమెను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు మీరు నేర్చుకొనే నైపుణ్యాలు, సాధించిన విజయాలు మీ ప్రొఫైల్‌కు ఆకర్షణీయతను తీసుకొస్తాయి. దీనికితోడు మీలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా రెజ్యుమెను చూడగానే సదరు కంపెనీకి మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంటర్యూకు సంబంధించిన ప్రిపరేషన్ బాగా చేయాలి. కేవలం టెక్నికల్ అంశాలపైనే కాకుండా బిహేవియరల్ ప్రశ్నలు మీ విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడతాయి.
- మీరు పనిచేయాలనుకొనే రంగంలో కొత్త ట్రెండ్స్ ఏం వస్తున్నాయో గమనించండి. అందుకు తగ్గ నైపుణ్యాలు, కోర్సులను నేర్చుకోవడం, సర్టిఫికెట్లు పొందడం వంటి అలవాట్లు మీ కెరీర్‌ను మరింత ప్రకాశమంతంగా తీర్చిదిద్దుతాయి. మీరు అప్‌డేట్‌గా ఉంటేనే జాబ్ మార్కెట్లో పోటీని తట్టుకోగలిగే కెపాసిటీ మీ సొంతమవుతుంది.