CBSE Exams | సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలివే..!
ఫిబ్రవరి 15నుంచి ప్రారంభమయ్యే సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు 42లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కొన్ని సూచనలు..
By Education News Team
Published :14 Feb 2024 17:10 IST
https://results.eenadu.net/news.aspx?newsid=14022025
CBSE Exams | ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు 10, 12 తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు దాదాపు 42 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. ఏడాది పాటు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులకు ఇదే అత్యంత సవాల్‌తో కూడిన కఠిన సమయం. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నష్టమే! విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులతో పాటు పాఠశాల ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు. మీ అడ్మిట్ కార్డులో పేర్కొన్న ప్రతి సూచనను క్షుణ్నంగా చదవడమే కాకుండా ఫాలో అయ్యేలా జాగ్రత్త వహించండి.
పరీక్ష రోజు ఇలా..
- కాన్ఫిడెన్స్‌తో ఉండండి: మీ ప్రిపరేషన్ పట్ల మీరు విశ్వాసంతో ఉండాలి. ప్రశాంతంగా ఉంటూ పరీక్షపైనే దృష్టి కేంద్రీకరించండి.
- హైడ్రేటెడ్‌గా ఉండండి: మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. ఇందుకోసం శరీరానికి అవసరమైనంత నీటిని తాగండి. చిన్న చిన్న విరామాలు తీసుకోండి.
- ఆటంకాలను అధిగమించండి: పరీక్షల సమయంలో సోషల్ మీడియా జోలికి వెళ్లొద్దు. మీ మానసిక ఆందోళనకు కారణమయ్యే సుదీర్ఘ ఫోన్‌కాల్స్‌ను నివారించండి.
పరీక్ష కేంద్రంలో..
పరీక్ష రాయడం ప్రారంభించడానికి ముందు 15 నిమిషాల పాటు ప్రశ్నపత్రం చదవడం చాలా ముఖ్యం. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి.. అందులో మీకు ఏవి సులభంగా, ఏవి కష్టంగా అనిపించాయో గుర్తించండి. సులువైన ప్రశ్నల్ని త్వరగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. కఠిన ప్రశ్నలకు ఎలా రాయాలో ప్లాన్ చేసుకోండి. సమాధాన పత్రంలో అంకెలు రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైనచోట రేఖాచిత్రాలను గీయడం ద్వారా పూర్తి మార్కులు సాధించొచ్చు. మీ జవాబు పత్రాలను దిద్దేవారు గందరగోళానికి గురికాకుండా హెడ్డింగ్‌లు, చక్కని చేతిరాత ఉండేలా జాగ్రత్త వహించండి.
- మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్దకు అరగంట ముందే చేరుకొనేలా ప్లాన్ చేసుకోండి.
- పరీక్ష కేంద్రంలోకి అనుమతించే స్టేషనరీ వస్తువులనే వెంట తీసుకెళ్లండి.
- మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి నిషిద్ధం.
- మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కని ప్రిపరేషన్, ప్రణాళికతో మంచి మార్కులు సాధించేలా ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్!