JEE Main 2026 | జేఈఈ మెయిన్ పరీక్షకు సర్వం సిద్ధం.. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా..!
జేఈఈ మెయిన్ పరీక్ష (JEE Main 2026)కు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచే (జనవరి 21) నుంచే ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.
By Education News Team
Updated :20 Jan 2026 16:34 IST
https://results.eenadu.net/news.aspx?newsid=Advisory-for-the-JEE-Main-2026-Candidates
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ పరీక్ష (JEE Main 2026)కు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచే (జనవరి 21) నుంచే ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. తాజాగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. వీటితో పాటు జేఈఈ మెయిన్ పరీక్ష ప్యాటర్న్, మార్కింగ్ స్కీమ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ పరీక్షల్లో ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు.. వాటికి మార్కులు, మైనస్ మార్కులు ఎలా ఉంటాయనే విషయాలను ఇందులో పొందుపరిచింది.
ఎగ్జామ్ ప్యాటర్న్, మార్కింగ్ స్కీమ్ కోసం క్లిక్ చేయండి
ఎన్‌టీఏ కీలక సూచనలివే..
పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందే అడ్మిట్ కార్డులో ఈ కింది అంశాలను సరిచూసుకోండి.
- అడ్మిట్ కార్డులో మీ పరీక్ష తేదీ; షిఫ్టు, పరీక్ష సమయం; ఎగ్జామ్ సెంటర్, సెంటర్ వద్దకు ఎన్ని గంటలకు వెళ్లాలి? గేటు మూసివేసే సమయం తదితర అంశాలను చెక్ చేసుకోండి.
- ఎగ్జామ్ సెంటర్‌కు సకాలంలో చేరుకొనేందుకు ఉన్న మార్గాల్ని తెలుసుకొనేందుకు ముందురోజే ఒకసారి వెళ్లి చూసుకొని రావడం ఉత్తమం (మీకు వీలుంటే).
- పరీక్షా కేంద్రం గేటు మూసివేసే సమయానికి కనీసం గంట ముందైనా చేరుకోండి. గేటు మూసివేసే సమయం తర్వాత రిపోర్ట్ చేస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీలతో నిఘా, జామర్లు అమర్చి ఉన్నందున అభ్యర్థులు అక్రమపద్ధతులు అవలంబించరాదని హెచ్చరిక
వీటిని వెంట తీసుకెళ్లండి..
- డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు (ఏ4 సైజు కలర్ ప్రింటవుట్ బెటర్)
- రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు (పరీక్ష కేంద్రంలో అటెండెన్స్ షీట్‌లో ఫొటో అతికించేందుకు..)
- విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించేలా ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసినప్పటి ఒరిజినల్ ఫొటో ఐడీ ప్రూఫ్ (మొబైల్ ఫోన్లలో సేవ్ చేసిన ఫొటో కాపీలు, ఫొటోలు అనుమతించరు).
- దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి.
- బీఆర్క్ పరీక్ష రాసే అభ్యర్థులైతే.. డ్రాయింగ్ టెస్ట్ (పేపర్ III- బీఆర్క్ ) సొంతంగా జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిళ్లు, రబ్బరు, కలర్ పెన్షిల్ తప్పకుండా తీసుకురావాలి.
వీటికి నో ఎంట్రీ
- చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్ ఉన్న దుస్తులు వేసుకోవద్దు. వీటితో పాటు నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. పరీక్ష కేంద్రం వద్ద మీ విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడానికి ఎలాంటి సౌకర్యమూ ఉండకపోవచ్చు.
మధుమేహం ఉన్న విద్యార్థులైతే.. షుగర్ టాబ్లెట్‌లు/ పండ్లు (అరటిపండు/యాపిల్/ఆరంజ్ వంటివి) వెంట తీసుకెళ్లొచ్చు. ట్రాన్స్‌పరెంట్ వాటర్‌బాటిళ్లను పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. అయితే, చాక్లెట్‌లు/క్యాండీస్/శాండ్‌విచ్ వంటి ప్యాక్‌డ్ ఫుడ్‌ని మాత్రం అనుమతించరు.
- పరీక్ష హాలు వద్ద రఫ్ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ప్రతి షీట్ పైభాగంలో తమ పేరు, రోల్ నంబర్‌ని తప్పనిసరిగా రాయాలి. పరీక్ష పూర్తయిన అనంతరం బయటకు వెళ్లేటప్పుడు నిర్దేశించిన డ్రాప్ బాక్స్‌లో వాటిని తప్పకుండా వేయాలి. లేదంటే సంబంధిత అభ్యర్థుల సమాధాన పత్రాలు మూల్యాంకనం నిలిపేసే అవకాశం ఉండొచ్చు.