Respect in the Workplace | పనిచేసే చోట ‘గౌరవం’ పొందేలా.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
పని చేసే చోట మీరూ అందరి తలల్లో నాలుకలా ఉండాలంటే.. కోరుకున్న గౌరవం దక్కించుకోవాలంటే ఎలాంటి గుణాలు అలవర్చుకోవాలో నిపుణులు చెబుతోన్న మెలకువలు ఇవే..
By Education News Team
Published :13 Jan 2024 09:06 IST
https://results.eenadu.net/news.aspx?newsid=13012025
Respect in The Workplace | ఇంటర్నెట్ డెస్క్: అందరం ఎక్కడో ఒకచోట పని(Job)చేస్తుంటాం.. కానీ, కొందరికే పనిచేసే చోట ఆదరణ, గౌరవం ఉంటాయి. ఆ కొందరితోనే మాట్లాడటానికి, తమ ఆలోచనల్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తుల్లో ఉన్న ప్రత్యేకతలేంటీ అని మీరెప్పుడైనా ఆలోచించారా? మరి, మీరూ అందరి తలల్లో నాలుకలా ఉండాలంటే.. కోరుకున్న గౌరవం దక్కించుకోవాలంటే ఎలాంటి గుణాలు అలవర్చుకోవాలో నిపుణులు చెబుతోన్న ఈ సూచనలు...
వర్క్- లైఫ్ బ్యాలెన్స్‌కు 7 చిట్కాలివిగో!
- పనిలో నాణ్యత, ఉత్పాదకతను పెంచేలా వినూత్నంగా ఆలోచిస్తూ.. ఇతరుల పట్ల సానుకూల దృక్పథంతో మెలిగే వారికి ఉండే గౌరవమే వేరు. చేసే పని పట్ల నిబద్ధత కూడా ఎంతో అవసరం. సమయానికి పనిని పూర్తి చేయడం, టీమ్ వర్క్, అందరితో కలిసిమెలిసి పనిచేసే నైపుణ్యాలు అలవర్చుకోవాలి.
- మీ ఆలోచనలు, అభిప్రాయాలను అవతలి వ్యక్తికి స్పష్టంగా వ్యక్తపరచడం రావాలి. మేనేజర్లు, సహోద్యోగులతో సంభాషించేటప్పుడు వారేం చెబుతున్నారో చురుగ్గా వినడంతో పాటు వాటిని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాలి. అవతలి వ్యక్తుల అభిప్రాయాలను గౌరవించేలా మాట్లాడే నేర్పు అవసరం.
- ఎవరైనా మనల్ని చెడుగా అంటే ఎంత బాధపడతామో.. ఎదుటివాళ్లూ అంతే కదా! అందువల్ల ఒకరి గురించి చెడుగా మాట్లాడే వ్యవహారశైలికి దూరంగా ఉండాలి. వదంతుల(గాసిప్స్)కు మీరు ఎట్టిపరిస్థితుల్లో కారణం కాకుండా జాగ్రత్త వహించండి. ఎవరేదైనా చెప్పినా విని ఊరుకోండి. ఆఫీసుల్లో వ్యక్తుల మధ్య దూరం పెంచేవి ఇవే గనక ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారిని అంతా ఉన్నతంగా చూస్తారు.
- ఇతరులు మీపట్ల ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా ఉండండి. ఇతరుల కట్టుబాట్లను గౌరవించడంతో పాటు ఆఫీసు నియమాలకు కట్టుబడి పనిచేయడం అలవర్చుకోండి.
- మీ చర్యలకు మీరే బాధ్యత వహించే దృక్పథం అలవర్చుకోండి. తప్పు మీదైతే నిజాయతీగా ఒప్పుకోండి. పక్కవారిపైకి నెట్టే ప్రయత్నం చేయొద్దు. తప్పుల నుంచి నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మీ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకొనేందుకు కృషి చేయండి.
- పనిచేసే చోట సహోద్యోగుల బాధలను అర్థం చేసుకొని (Empathy) మెలగడం చాలా అవసరం. ఓదార్చే గుణం ఉండాలి. ఈ దృక్పథం పరస్పర సహకార భావాన్ని పెంపొందిస్తుంది. టీమ్ చేసే కొత్త ప్రయత్నాలకు మద్దతుగా నిలవండి. ఏదైనా ప్రాజెక్టు/పనిలో ఇతరుల సహకారాన్ని గుర్తించి.. మెరుగైన ఫలితాలిచ్చే సూచనలు చేయగలిగే మనస్తత్వాన్ని అలవర్చుకోండి.
- కొందరు ఎదుటివారిపై ఫిర్యాదులు చేయడమే ఒక పనిగా పెట్టుకుంటుంటారు. దానికన్నా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. పనిలో ఎదురయ్యే సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలు సూచించండి. ఏదైనా అంశాలపై చర్చలు జరుగుతున్నప్పుడు సానుకూలంగా సహకరించండి.
- మారుతున్న కాలానికనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోతే అవుట్ డేటెడ్ అయిపోతారు. అందువల్ల మీ నైపుణ్యాలు, జ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవడం తప్పనిసరి. ఎంచుకున్న రంగంలో అప్‌డేట్‌గా ఉంటేనే మీకు విలువ పెరుగుతుంది. టీమ్‌లో మీ గౌరవం ఇనుమడిస్తుంది.
- కొందరు మార్పును అంత తేలిగ్గా స్వాగతించరు. ఏదో ఒక వంకలు చెబుతూ కొత్త పనికి అడ్డుపుల్లలు వేసే దృక్పథంతో ఉంటారు. అలా కాకుండా అన్ని వైపుల నుంచి కొత్త ఆలోచనలను ఆహ్వానించాలి. ఎప్పటికప్పుడు జరిగే మార్పులకనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకొంటూ.. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
- మనం చేసే పని చిన్నదైనా, పెద్దదైనా అందులో చిత్తశుద్ధితో వ్యవహరించడం ఎంతో అవసరం. నిరంతరం నిజాయతీ, న్యాయబద్ధంగా, నైతిక విలువలు పాటిస్తూ నలుగురితో హాయిగా, ఆనందంగా కలిసి పనిచేస్తున్నారా చెక్ చేసుకోండి. పనిచేసే చోట తోటివారి పట్ల ఇలా మెలిగితే మీరు కోరుకున్న విలువ, గౌరవం వాటంతట అవే వస్తాయి.. మీరూ ప్రయత్నించి చూడండి.