వర్క్- లైఫ్ బ్యాలెన్స్‌కు 7 చిట్కాలివిగో!
ఆఫీస్ వర్క్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడాన్ని మరింతగా మెరుగుపరిచే 7 చిట్కాలు మీ కోసం.
Published :10 Sep 2024 17:42 IST
https://results.eenadu.net/news.aspx?newsid=10092024
Work-Life balance| నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవితమే! ఒత్తిడి (Stress)లో పనిచేస్తూ కాస్త సమయం దొరికితే హాయిగా విశ్రాంతి (Rest) తీసుకోవాలనుకొనేవారే అధికం. కానీ, అటు ఆఫీస్‌లో పని (Work) ఒత్తిళ్లు- ఇటు వ్యక్తిగత (Life) జీవిత వ్యవహారాలు.. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ప్రతిఒక్కరికీ పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆఫీస్ వర్క్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడాన్ని మరింతగా మెరుగుపరిచే 7 చిట్కాలు మీ కోసం.
హద్దులు పెట్టుకోండి..
ఆఫీస్‌లో మీ పని వేళలకు కట్టుబడి ఉండండి. ఆ టైంలో వేరే పనులేమీ పెట్టుకోవద్దు. మీ వ్యక్తిగత సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకు మీరు ఏర్పరచుకున్న బౌండరీలను తోటి ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు తెలియజేయండి. అలా చేయడం ద్వారా మీ పనికి ఆటంకం ఎదురయ్యే అవకాశాలు ఉండవు. ఆఫీస్ వర్క్ పూర్తయ్యాక వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టండి.
‘నో’ చెప్పడం నేర్చుకోండి..
‘నో’ అనేది చిన్న మాటే. కానీ, అలా ఎవరికైనా చెప్పాలంటే చాలా కష్టం. మొహమాటం అడ్డొస్తుంది. ఎదుటివాళ్లు హర్ట్ అవుతారనో, స్నేహం దెబ్బతింటుందనో ఆలోచిస్తూ కూర్చుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే! శక్తికి మంచిన పనుల్ని భుజంపై వేసుకోవడం వల్ల ఒత్తిడికి దారితీస్తుంది. అందువల్ల మీరు అప్పటికే ఒక పనిలో నిమగ్నమై ఉంటే.. అదనపు పనిని గౌరవంగా తిరస్కరించడం నేర్చుకోండి. ఈ రకంగా మీ కమిట్‌మెంట్‌ను కొనసాగించడం ద్వారా వర్క్-వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యప్రదంగా మార్చుకోవచ్చు.
ఇతరులపైనా విశ్వాసం ఉంచండి..
ప్రతిదీ మీరే చేయాలన్న ఆరాటం వద్దు. నిర్దిష్టమైన కొన్ని పనులను అప్పగించేందుకు మీ టీమ్ లేదా సహోద్యోగులపై విశ్వాసం ఉంచండి. అలా చేయడం ద్వారా మీపై భారం తగ్గమే కాకుండా ఆఫీస్‌లో పరస్పర సహకారం భావం పెంపొందడమే కాకుండా వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు 8-8-8 రూల్.. మీరూ ట్రై చేస్తారా?
ప్రియారిటీలు పెట్టుకోండి..
ఇంటి పనైనా, ఆఫీస్ వర్క్ అయినా సమయానికి పూర్తి కావాలంటే ప్రాథమ్యాలు నిర్ణయించుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఆ రోజులో మీరు చేయాల్సిన పనులేంటి? వాటిలో అత్యంత ప్రాధాన్యమున్నవేంటి?ఆ తర్వాత చేయాల్సినవి ఏంటనే అంశాలను ఓ జాబితాగా రాసుకోండి. ఈ నియమం ఆఫీస్ పనులకే కాదు.. ఇంటి పనులకూ వర్తిస్తుంది.
చిన్న విరామం తీసుకోండి..
విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసట పెరగడమే కాదు.. పనిలో నాణ్యత, ఉత్పాదకత తగ్గుతుంది. అందువల్ల అవకాశం ఉంటే.. వర్క్ ప్లేస్‌కు కొంచెం దూరంగా వెళ్లి కాసేపు వాకింగ్, ధ్యానం వంటివి చేయడంతో పాటు కాఫీని ఆస్వాదించండి. ఇలాంటి టాస్క్‌లు మిమ్మల్ని రీఛార్జి చేయడంతో పాటు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలా ప్రేరేపిస్తాయి.
ఆరోగ్యంతో ‘బ్యాలన్స్’!
ఏ పనిచేయాలన్నా శరీరం, మనస్సు సహకరించాలి. అందువల్ల రెంటినీ ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో కీలకం. ఈ రెండూ సాధ్యం కావాలంటే ఆరోగ్యమే ప్రధానం. అందువల్ల మీరు తీసుకునే ఆహారం, చేసే వర్కవుట్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది తీరిక లేదంటూ సమయానికి భోజనం చేయరు.. ఆహారం విషయంలోనూ శ్రద్ధ పెట్టారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంత బిజీగా ఉన్నా సరే.. టైంకి భోజనం చేయడం ముఖ్యం. దీనికితోడు, రోజూ ఓ అరగంట వ్యాయామం, ధ్యానం.. వంటివి చేస్తే మనసుకు ఉల్లాసంగా ఉంటుంది.
కలిసి పంచుకుంటేనే.. కలదు సుఖం
ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే జీవితం సాఫీగా ముందుకు సాగే పరిస్థితి. అందువల్ల ఇంటి పనిలో పరస్పర సహకారం ఎంతో అవసరం. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం.. వంటివి భార్యాభర్తలిద్దరూ కలిసి పంచుకున్నా; బట్టలు ఆరేయడం, వాటిని మడతపెట్టడం, ఇల్లు ఊడవడం.. వంటి చిన్న చిన్న పనుల్లో పిల్లలను భాగస్వాముల్ని చేయడం. తద్వారా మీపై పని భారం తగ్గడంతో పాటు పిల్లలకూ పని అలవాటవుతుంది.