Smart Revision | స్మార్ట్‌ రివిజన్‌కు టిప్స్‌ ఇవిగో.. 30-10 రూల్‌ తెలుసా?

Smart Revision | స్మార్ట్‌ రివిజన్‌కు టిప్స్‌ ఇవిగో.. 30-10 రూల్‌ తెలుసా?

ఏడాదంతా చదివిన సిలబస్‌ను పరీక్షలకు ముందు ఏకమొత్తంలో సరిచూసుకునే ప్రక్రియ.. పునశ్చరణ (Revision).

Eenadu icon
By Education News Team Published :12 Dec 2025 15:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏడాదంతా చదివిన సిలబస్‌ను పరీక్షలకు ముందు ఏకమొత్తంలో సరిచూసుకునే ప్రక్రియ.. పునశ్చరణ (Revision). దీనికి కచ్చితమైన ప్రణాళిక అవసరం. అలాగని, పరీక్షలకు ముందు గంటల పాటు ఏకధాటిగా కూర్చొని చదివేస్తూ ఒత్తిడి పెంచేసుకోవడం కాదు. ప్రతి అరగంటకు ఓ చిన్న విరామం తీసుకోవడం ద్వారా మెరుగైన స్కోరు సాధించవచ్చంటున్నారు నిపుణులు. పరీక్షకు వారం రోజుల ముందు మెరుగ్గా గుర్తుంచుకొనేలా కొన్ని స్మార్ట్‌ ప్రిపరేషన్‌ టిప్స్‌ ఇవిగో!

  • పరీక్షల సమయంలో తొలుత ఎక్కువ వెయిటేజీ ఉన్న చాప్టర్లను రివిజన్‌ చేయడంతో మొదలు పెట్టండి. ఏటా అడిగే టాపిక్స్‌ను మరోసారి చదువుకోండి. ఫార్ములాలు, మైండ్‌ మ్యాపింగ్‌ టెక్నిక్‌లను అనుసరించడం ద్వారా ముఖ్యమైన కాన్సెప్టులపై దృష్టిసారించండి.
  • పరీక్షకు వారం రోజుల ముందు కొత్త చాప్టర్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దు. అన్నీ గుర్తుంచుకోవాలని ప్రయత్నించకండి. అలాగే, పుస్తకాలను మార్చకండి. మీకు ఇప్పటికే బాగా తెలిసిన విషయాలకే కట్టుబడి పరీక్షలు రాయండి.
  • 30-10 రూల్‌: తొలుత 30 నిమిషాల పాటు ఏకాగ్రతతో చదవండి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు బ్రేక్‌ తీసుకోండి. ఇలా  మీ రివిజన్‌ను కొనసాగించడం ద్వారా ఆలోచలను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడంతో పాటు చదివిన వాటిని మెరుగ్గా గుర్తుంచుకొనే సామర్థ్యం అలవడుతుంది. మీరు నేర్చుకొనే విధానంలో మంచి మార్పును తీసుకొస్తుంది.
  • పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయండి. దీనివల్ల మీకు పేపర్‌ ప్యాటర్న్‌ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే, ఏటా అడిగే ప్రశ్నలు లేదా ఏయే చాప్టర్‌ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకొనేందుకు కనీసం ఐదు లేదా ఏడేళ్ల పేపర్లను సాల్వ్‌ చేసేందుకు ప్రయత్నించండి.
  • రివిజన్‌ అంటే.. పరీక్ష తేదీలకు ఇంకా మిగిలి ఉన్న కొద్ది రోజుల్లో చదవాల్సిన సబ్జెక్టులు, అందులో ముఖ్యమైన అంశాలను మననం చేసుకోవడం. అందుకని రోజూ ఒకటి చొప్పున మాక్‌ టెస్టులు తీసుకోండి. నిజంగా మీకు పరీక్షలో ఉండేంత సమయాన్నే మాక్‌ టెస్టుకు కేటాయించుకోండి. తద్వారా పరీక్షలో మీ వేగం మెరుగవుతుంది. అలాగే, ఈ ప్రక్రియలో మీరు చేసే తప్పులను విశ్లేషించుకొని మరోసారి రివైజ్‌ చేసుకోవచ్చు.
  • మీరు ఇప్పటికే ప్రిపరేషన్‌ సమయంలో సిద్ధం చేసుకున్న షార్ట్‌ నోట్స్‌ను రివైజ్‌ చేసుకోండి. మీ సొంత నోట్స్‌ ఉంటే వేగంగా రీకాల్‌ చేసుకోవడం ఉత్తమం. సమ్మరీలను చదవి.. వాక్యాలను హైలైట్‌ చేసుకోండి. మైండ్‌ మ్యాప్‌లను ఒకసారి చూసుకోండి. పూర్తి చాప్టర్లను మళ్లీ ఓపెన్‌ చేయడం వంటి పొరపాట్లను మాత్రం పరీక్షలకు ముందు అస్సలు చేయొద్దు. 
  • మొత్తం టాపిక్‌ని కవర్‌ చేసేలా ట్రీచార్ట్‌, ఫ్లోచార్ట్‌లను తయారుచేసుకోండి. వాటిని ఒకసారి విజువలైజ్‌ చేసుకోవాలి. స్వయంగా రాసుకునే నోట్స్‌ వల్ల సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో అవి గుర్తుండిపోతాయి. ఎవరి షార్ట్‌ నోట్స్‌ వారే తయారుచేసుకోవడం ద్వారా ఓ పాయింట్‌ చూడగానే దాని చుట్టూ ఏం జరిగిందనే విషయం గుర్తురావడంతో మెరుగైన ఫలితాలు పొందొచ్చు.