APPLE job skills | ‘యాపిల్‌’లో ఉద్యోగానికి ఈ స్కిల్స్‌ కావాలి.. టిమ్‌కుక్‌ చెప్పిన విశేషాలివే!

‘యాపిల్‌’లో ఉద్యోగానికి ఈ స్కిల్స్‌ కావాలి.. టిమ్‌కుక్‌ చెప్పిన విశేషాలివే!

యాపిల్‌ కంపెనీలో పనిచేయాలనుకునే ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలపై ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివే..

Published : 09 June 2024 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple)లాంటి దిగ్గజ కంపెనీలో పనిచేయాలని కలలు కనని టెకీలుండరు. కానీ, అందరికీ ఈ సదావకాశం దక్కదు కదా..!  వినూత్న ఆవిష్కరణలు, నాణ్యమైన ఉత్పత్తులకు చిరునామాగా నిలిచిన ఈ  కంపెనీలో చేరాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? ఏం చేస్తే ఈ టెక్‌ దిగ్గజ కంపెనీలో అడుగుపెట్టగలం? కొత్తగా చేరాలనుకొనేవారిలో ఎలాంటి నైపుణ్యాల కోసం చూస్తారు? వంటి అంశాలపై స్వయంగా ఆ సంస్థ సీఈవోనే టిమ్‌కుక్‌ ఓ సందర్భంలో పంచుకున్న విశేషాలు మీకోసం!

‘‘యాపిల్‌ కంపెనీ ఉద్యోగులందరిలో కామన్‌గా ఒకరికొకరు సహకారంతో పనిచేసే లక్షణం తప్పనిసరిగా ఉంటుంది. 1+1=3 అనే కాన్సెప్టుతో క్రిటికల్‌గా థింకింగ్‌ కలిగిన వారికి అధిక ప్రాధాన్యం. ఒక్కొక్కరు తమ వ్యక్తిగత సామర్థ్యంతో పనిచేస్తే వచ్చే ఫలితం కన్నా అందరూ కలిసికట్టు(team work)గా పనిచేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి.  కొత్తగా తీసుకోబోయే వారిలోనూ ఇలా సమన్వయంతో పనిచేసే స్వభావం ఉందా? లేదా అనేది పరిశీలిస్తాం’’ అన్నారు. 

యాపిల్‌ (Apple)లో పనిచేయాలంటే కచ్చితంగా కాలేజ్‌ డిగ్రీ ఉండాలా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘యాపిల్‌లో అన్ని రంగాల వారికీ పని ఉంటుంది. ఈ క్రమంలో కాలేజ్‌ డిగ్రీ కచ్చితంగా అవసరంలేని వారు కూడా మా కంపెనీలో ఉన్నారు. అలాగే యాపిల్‌లో పనిచేసేవారికీ అత్యంత కీలకమైన నైపుణ్యాల్లో కోడింగ్‌ కూడా ఒకటి. అయితే, కోడింగ్‌పై పెద్దగా అవగాహనలేని.. రోజువారీ కార్యకలాపాల్లో అంతగా కోడింగ్‌ ఉపయోగించని వారిని సైతం యాపిల్‌ నియమించుకుంది. అనునిత్యం నేర్చుకుంటూ.. ప్రశ్నలు అడగడానికి భయపడని స్వభావం కలిగినవారిని నేను కోరుకుంటా.  అలాగే సృజనాత్మకతతో బృందంలో కలిసి పనిచేసేవారి కోసమూ మేం అన్వేషిస్తాం’’ అని వెల్లడించారు. 

టిమ్‌ కుక్‌కు నచ్చిన పుస్తకాలివే..

  • టు కిల్‌ ఏ మాకింగ్‌బర్డ్‌ (To Kill A Mockingbird): ఈ పుస్తక రచయిత హార్పర్‌ లీ. విద్యార్థులతో పాటు ఇది అన్ని వయసులవారినీ ఆకట్టుకుంటుందని టిమ్‌ కుక్‌ తెలిపారు. 
  • షూ డాగ్‌ (Shoe Dog): నైకీ సహ వ్యవస్థాపకుడు ఫిల్‌ నైట్‌.. తమ కంపెనీ నిర్మాణం, ఆయన వ్యక్తిగత జీవిత అనుభవాలను ఈ ‘షూ డాగ్‌’ పుస్తకంలో పంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
  • వెన్‌ బ్రీత్‌ బికమ్స్‌ ఎయిర్‌ (When Breath Becomes Air ): ఈ పుస్తక రచయిత పాల్‌ కళానిధి. అసాధారణమైన జ్ఞాపకాల పుట్టగా ఈ పుస్తకాన్ని కుక్‌ అభివర్ణించారు. న్యూరోసర్జన్‌ అయిన కళానిధి.. అనారోగ్యం, మెడిసిన్‌కు సంబంధించిన అనేక విషయాలను ఈ పుస్తకంలో పంచుకున్నట్లు పేర్కొన్నారు.
  • ఐయామ్‌ మలాలా (I Am Malala): ఆడపిల్లల చదువు కోసం మలాలా యూసఫ్‌జాయ్‌ చేస్తున్న పోరాటాన్ని కుక్ అభినందించారు. బ్రిటన్‌ జర్నలిస్ట్‌ క్రిస్టినా ల్యాంబ్‌తో కలిసి ఈ జీవిత చరిత్ర పుస్తకం.. మాలాలా చిన్నతనం, 15 ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఉంటుందన్నారు. పై పుస్తకాలతో పాటు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, బాబీ కెన్నెడీ జీవితచరిత్ర పుస్తకాల నుంచి కూడా తాను స్ఫూర్తి పొందానని కుక్‌ తెలిపారు.