Study Habits Improve Tips చదివే అలవాటు పెంచే ఈ టెక్నిక్స్.. జ్ఞాపకశక్తినీ మెరుగుపరుస్తాయ్!
విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తితో పాటు మొత్తం అకడెమిక్ పెర్ఫామెన్స్ పెంచేలా అధ్యయన అలవాట్లను మెరుగుపరిచేలా కొన్ని శాస్త్రీయమైన టెక్నిక్స్ ఇవిగో..
Published :08 Aug 2024 16:55 IST
https://results.eenadu.net/news.aspx?newsid=08082024
Study habits| ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులు ఏ అంశాన్నయినా అధ్యయనం చేయాలంటే ఆసక్తి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి.. ఈ మూడే అత్యంత కీలకం. ఇవి కొరవడితే ఎంతసేపు చదివినా, ఏం చదివినా వృథానే! పరీక్షలప్పుడు హడావుడిగా బట్టీపట్టి చదవడం వల్ల అప్పటికప్పుడు గట్టెక్కి తాత్కాలిక ఉపశమనం పొందొచ్చేమో గానీ.. అంతకుమించిన ప్రయోజనాలుండవ్! ఏకాగ్రత, జ్ఞాపకశక్తితో పాటు మొత్తం విద్యార్థి అకడెమిక్ పెర్ఫామెన్స్ పెంచేలా అధ్యయన అలవాట్లను మెరుగుపరిచేలా కొన్ని శాస్త్రీయమైన టెక్నిక్స్ ఇవిగో..
ఎస్‌క్యూ 3ఆర్ స్టడీ టెక్నిక్
ఇదో క్రియాశీలకమైన అధ్యయన పద్ధతి. పుస్తకాలు లేదా ఇతర వాస్తవిక ఆధారాల నుంచి సమాచారాన్ని సమర్థంగా నేర్చుకొనేందుకు దోహదపడుతుంది. SQ3R మెథడ్ అంటే.. చదివే విషయాన్ని సర్వే చేయడం (Survey), ప్రశ్న (Question), చదవడం (Read), పునశ్చరణ (Recite), సమీక్షించడం (Review) వంటివి ఉన్నాయి.
- S- Survey (సర్వే): పుస్తకం/చాప్టర్ చదవడానికి ముందు అందులో ముఖ్యమైన పాయింట్లు ఏమున్నాయో గుర్తించండి. శీర్షికలు, ఉపశీర్షికలు, గ్రాఫిక్‌లు, టేబుల్స్, ఫోటోకింద క్యాప్షన్స్‌తో పాటు డయాగ్రమ్‌లు, మ్యాప్‌లు, పరిచయ, చివరి పేరాగ్రాఫ్‌లను క్షుణ్నంగా పరిశీలించండి. ఈ క్రమంలో మీరు అందులో ముఖ్యాంశాలేంటో గ్రహించవచ్చు.
- Q-Question (ప్రశ్నలు): మీరు చదవాలనుకున్న పాఠ్యాంశం/పుస్తకం నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. దానిపై కొన్ని ప్రశ్నలు తయారు చేసుకోండి. ఇందుకోసం హెడ్డింగ్స్‌ను ప్రశ్నలుగా మార్చుకోవడం, పాఠ్యాంశం ఆరంభం, చివరిలో రచయిత ప్రశ్నలు ఇచ్చారేమో చూడండి. ఈ అంశం గురించి ఇప్పటివరకు మీకు తెలిసిందేంటో, దీన్నుంచి కొత్తగా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఒక పేపర్‌పై పెట్టి పెడితే ప్రయోజనకరం.
- R - Read (చదవడం): చదివే క్రమంలో మీ ప్రశ్నలకు సమాధానాలను వెతకండి. ఇందుకోసం ఆ టెక్ట్స్‌లో ఉన్న ఫొటోలు, డయాగ్రమ్స్ కింద క్యాప్షన్లు చదవండి. హైలైట్ చేసిన సమాచారంపైనా దృష్టి పెట్టండి. కొత్త ఆలోచనలు, భిన్నమైన అభిప్రాయాలనూ పరిశీలించడం ద్వారా ఆ సబ్జెక్టుపై సమగ్రత ఏర్పడుతుంది. చదువుతున్న క్రమంలో క్లిష్టంగా, అస్పష్టంగా అనిపిస్తే కాసేపు ఆపేసి.. మళ్లీ చదవండి.
- R - Recite (రిసైట్): మీరు చదివిన సమాచారాన్ని మీ మాటల్లోనే చెప్పే/రాసే ప్రయత్నం చేయండి. చదివిన విషయాన్నే పునరావృతం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. తద్వారా ఏమేరకు మీకు అర్థమైందో తెలుసుకోవచ్చు. ఏదైనా పూర్తిగా అర్థం కాకపోతే.. ఆ సెక్షన్‌ను మళ్లీ చదవడం, నోట్సు రాసుకోవడం, ఆలోచనలను మీ సొంత పదాల్లో వ్యక్తపరచడం వంటి అభ్యాసప్రక్రియ మేలు చేస్తుంది.
- R - Review (సమీక్ష): మీరు చదివిన/పునశ్చరణ చేసిన పాఠ్యాంశాన్ని మళ్లీ సమీక్షించడం ద్వారా ఆ సబ్జెక్టుపై మీకు పట్టు ఏర్పడుతుంది. మీరు రాసుకున్న నోట్సును తిరిగి చదవడం, మీ సొంత అనుభవాలతో ఆ సమాచారాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా ఆ విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
చదవడానికి ముందు వ్యాయామం మంచిదే..
చదవడానికి ముందు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఎంతో మేలు చేస్తుంది. ఈ ప్రక్రియ మీ మెదడును చురుగ్గా ఉంచడంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చిన్న చిన్న వర్కవుట్‌లు మీ ఫోకస్‌ను పెంచడమే కాదు.. ఒత్తిడిని తగ్గించి స్టడీ సెషన్లు మరింత సమర్థంగా ఉండేలా చేస్తుంది.
కలర్ కోడెడ్ నోట్స్
నోట్స్ రాసేటప్పుడు వివిధ రంగులను ఉపయోగించడం ద్వారా విజువల్ లెర్నర్స్ సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో ఈ విధానం ఉపయోగపడుతుంది. కలర్-కోడింగ్ ముఖ్యమైన కాన్సెప్టులను హైలైట్ చేయడంతో పాటు అధ్యయనాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
నిద్రపోయే ముందు చదివితే మేలు
మీరు నిద్రపోయే ముందు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్రపోయే ముందు మీరు చదవాలనుకున్న మెటీరియల్‌ని ఒకసారి చూసుకోవడం వల్ల మీ మెదడు మరింత సమర్థంగా సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడంలో దోహదపడుతుంది.
మైండ్ మ్యాపింగ్
మీ ఆలోచనలు, భావాలను అనుసంధానం చేసేలా విజువల్ రేఖాచిత్రాల రూపకల్పనే మైండ్ మ్యాపింగ్ పద్ధతి. ఈ టెక్నిక్ మీకు ఆయా టాపిక్‌ల మధ్య సంబంధాలను తేలిగ్గా అర్థం చేసుకోవడంతో పాటు ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా ఉపయోగపడుతుంది.
ఫెయిన్మన్ లెర్నింగ్ టెక్నిక్..
మీ లెర్నింగ్ ప్రక్రియకు ఈ టెక్నిక్ ఒక రీఛార్జిలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఫెయిన్మన్ టెక్నిక్ అంటే.. మీరు నేర్చుకున్న విషయాన్ని సాధారణ పదాల్లో మరొకరికి సరళంగా అర్థమయ్యేలా చెప్పగలిగే నైపుణ్యాన్ని సాధించే ప్రక్రియ. ఇది మీ అవగాహనలో లోపాలను గుర్తించడంతో పాటు మీ జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ టెక్నిక్ ద్వారా మీరు చదవాలనుకున్న ఏదైనా సబ్జెక్టులో మీకు తెలిసినవి ఒక పేపర్‌పై అందరికీ అర్థమయ్యేంత సరళంగా రాసుకోవాలి. ఇలా రాసేటప్పుడు వచ్చే సందేహాలను అదే పేపర్‌పై వేరే సిరాతో రాయాలి. వాటికి సమాధానాలు వెతికి ఆ సందేహాలను నివృత్తి చేసుకొనే క్రమంలో మీ జ్ఞాన సంపద పెంచుకోవచ్చు.