SSC GD Constable| టెన్త్ అర్హతతో 39వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?
సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
Published :(05 Sep 2024 20:56) IST
https://results.eenadu.net/news.aspx?newsid=050924
SSC GD Constable Recruitment| దిల్లీ: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల (Central Government Jobs) కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్. దేశంలోని కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గురువారం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తంగా 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా; తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలు (CAPF)తో పాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో (రైఫిల్‌మ్యాన్), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.
చదివింది గుర్తుండట్లేదా? మీ సమస్యకు చెక్ పెట్టే 10 మెమరీ టిప్స్ ఇవిగో!
ఏ విభాగంలో ఎన్నెన్ని పోస్టులు
గురువారం రాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 39,481 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో 35,612 పురుషులు, 3869 మహిళా కేటగిరీలో భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. బీఎస్‌ఎఫ్‌లో అత్యధికంగా 15,654 పోస్టులను భర్తీ చేయనుండగా.. సీఐఎస్‌ఎఫ్‌లో 7,145; సీఆర్‌పీఎఫ్‌లో 11,541; ఎస్‌ఎస్‌బీలో 819; ఐటీబీపీలో 3017; ఏఆర్‌లో 1248; ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 35, ఎన్‌సీబీలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఈ 21 యూనివర్సిటీలు ఫేక్.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవ్!
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
- వేతనం: పే లెవెల్ -1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ. 18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్ -3 కింద (రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
- అభ్యర్థుల వయసు: జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్లు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
- దరఖాస్తు రుసుం: రూ.100 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ వర్గాలకు చెందినవారికి మినహాయింపు)
- ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ/పీఎస్‌టీ/ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. 60 నిమిషాల పాటు ఉండే ఈ పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులకు ఉంటుంది.
- పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్; జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్; ఇంగ్లిష్/హిందీ సబ్జెక్టుల్లో ఒక్కో అంశంలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు.
- ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం రాసేముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.