Memory Tips: చదివింది గుర్తుండట్లేదా? మీ సమస్యకు చెక్ పెట్టే 10 మెమరీ టిప్స్ ఇవిగో!
చాలా మంది విద్యార్థులు ఎప్పుడు చూసినా చదువుతున్నట్లు కనబడినా.. చదివింది కొద్ది రోజులకే మర్చిపోతుంటారు. దీంతో పరీక్షల సమయానికి తీవ్ర ఆందోళనకు గురై ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని సూచనలివే..
Published :(12 August 2024 07:00) IST
https://results.eenadu.net/news.aspx?newsid=120824
Reading Tips| ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది విద్యార్థులు సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా.. ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకొని చదువుతూనే ఉంటారు. అయినా కొద్ది రోజులకే నేర్చుకున్నదంతా మర్చిపోతుంటారు. దీంతో పరీక్షలు దగ్గర పడేసరికి వారిలో మానసిక ఆందోళన, ఒత్తిడి పెరిగి.. ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని సూచనలివే..
- ప్రశాంత వాతావరణం చూసుకోండి.. మీరు చదువుకునే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా, ఎలాంటి ఆటంకాల్లేకుండా ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీ దృష్టిని పూర్తిగా చదువుతున్న అంశంపైనే కేంద్రీకరించే వీలుంటుంది. ఇక చదివింది మీకు గుర్తుండాలంటే ఏకాగ్రత కీలకం. ఏకాగ్రత నిలవడానికి ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరం. అందువల్ల, ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని చదవడం అలవాటు చేసుకోండి.
- బట్టీ వద్దు.. అర్థం చేసుకొని చదవండి: మీరు చదివే సబ్జెక్టు ఏదైనా అందులోని విషయాలను బట్టీపట్టడానికి ప్రాధాన్యం ఇవ్వొద్దు. అర్థంచేసుకుంటూ చదివితే ఎక్కువ కాలంపాటు గుర్తుంటుంది. సమాచారం అంతటినీ ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవాలని అనుకోవద్దు. వ్యాసాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకుని చదివితే గుర్తుంచుకోవడం తేలిక.
- సంక్షిప్త నామాలుగా విభజిస్తే మరిచిపోరు: మీ వద్ద ఉన్న సమాచారాన్ని చిన్న చిన్న పదాలు, వాక్యాలుగా విభజించుకోవడం మంచి టెక్నిక్. పదాల్లోని తొలి అక్షరాన్ని గుర్తుంచుకుంటే మొత్తం పదం, ఆ తర్వాత సంబంధిత వాక్యాన్ని గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది.
చదవడానికి టైం చాలట్లేదా? ఇలా ట్రైచేసి చూడండి!
- రూపాన్ని గుర్తుంచుకోండి: ప్రముఖుల పేర్లను గుర్తుంచుకునే క్రమంలో వారి రూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఆ పేరున్న వ్యక్తి ఇలా ఉంటారు.. అని ఒకసారి అనుకుంటే.. సంబంధిత వ్యక్తి ఫోటో చూడగానే వారి పేరు టక్కున స్ఫురిస్తుంది.
- నోట్సు రాసే అలవాటు ఉందా?: ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాయడాన్ని అలవాటు చేసుకోండి. పరీక్షల ముందు వీటిని ఒకసారి చదువుకుంటే ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. అలాగే చదివిన వాటిని ఎప్పటికప్పుడు చూడకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల విషయం ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. సగం మాత్రమే గుర్తుంటే మిగతా సగాన్ని మళ్లీ చదువుకుని, చూడకుండా రాయొచ్చు.
- ఎప్పటికీ గుర్తుండిపోయే ‘అంతర్ సూత్రం’: కొన్ని పేర్లను వాటి వెనుక ఉండే అంతర్‌సూత్రం ఆధారంగా చదివితే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఉదాహరణకు రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాచేస్తే మధ్యలో ఏ ఒక్క రాష్ట్రం పేరునూ మర్చిపోయే అవకాశం ఉండదు. అలాగే గ్రహాల పేర్లను వాటి పరిమాణం ఆధారంగా చిన్నవాటి నుంచి పెద్దవాటిని గుర్తు పెట్టుకోవచ్చు.
- చదివే ప్రదేశాన్ని మారుస్తుండండి: ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల ఒక్కోసారి కాస్త విసుగ్గా అనిపించొచ్చు. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడూ మారుస్తుండండి. కుటుంబ సభ్యుల మాటలు, టీవీ, స్మార్ట్‌ఫోన్ వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోండి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే మంచిది. అలాగే మధ్యలో కాస్త చిరాకుగా అనిపిస్తే.. పరిసరాలను గమనించడం ద్వారానూ సేదతీరొచ్చు. ఆ తర్వాత మళ్లీ చదవడం మొదలు పెట్టొచ్చు.
ఈ కంపెనీల్లో ఉద్యోగం వస్తే జాక్‌పాట్ తగిలినట్లే!
- ఇష్టంగా చదివితే కష్టమేం కాదు: పాఠాలను ఎప్పుడూ పరీక్షల దృష్టితోనే చదవకండి. ఇష్టంగా చదివితే నేర్చుకోవడం ఎప్పుడూ కష్టంగా ఉండదు. నేర్చుకోవడంలోని ముఖ్యోద్దేశం.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఒక్కటే కాకూడదు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడూ ఉండాలి. ఇది ఉంటే పాఠాలేవీ విసుగ్గా అనిపించవు. కొత్త విషయాలనూ ఎంతో ఇష్టంగా నేర్చుకోగలుగుతారు.
- ఒకసారి సమీక్షించుకోండి..: విద్యా సంవత్సరం ఆరంభమయ్యే సమయంలో చదివే పాఠాలను.. తిరిగి సంవత్సరాంతంలో మాత్రమే మళ్లీ వాటిని చదువుతారు కొందరు. అలాకాకుండా సమయం ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి సమీక్షించుకోవడం ఉత్తమ పద్ధతి. దీంతో అవన్నీ మీకు ఎంతవరకు గుర్తున్నాయో తెలుస్తుంది. మర్చిపోతే మళ్లీ ఒకసారి చదవడానికి అవకాశం ఉంటుంది.
- నాణ్యమైన ఆహారం, నిద్ర ఉండేలా..: ప్రతిరోజూ నాణ్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నిద్ర పోవాలి. సరిగా నిద్రపోకపోతే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందువల్ల నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి. రోజూ ఏడు నుంచి 9గంటలు నిద్రపోయేలా తగిన ప్రణాళిక వేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి. తక్కువ కొవ్వులు, అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోండి.