kendriya vidyalaya | పిల్లల్ని కేవీల్లో చేర్పించాలా? ఇవి తెలుసుకోండి!
పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya) చేర్పించాలనుకొనే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలివిగో..
By Education News Team
Published :04 Mar 2025 15:22 IST
https://results.eenadu.net/news.aspx?newsid=04032025-kendriya-vidyalaya
Kendriya Vidyalaya Admissions | ఇంటర్నెట్ డెస్క్: తమ పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya Vidyalaya) చేర్పించేందుకు చాలా మంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. బయట భారీగా ఉన్న ఫీజుల మోత నుంచి ఉపశమనం ఒకటైతే.. ఇక్కడ చేర్పిస్తే ప్లస్ 2 వరకు నిశ్చింతగా చదువుకోవచ్చన్న ధీమా ఇందుకు మరో కారణం. వీటిలో సీటు రావడం చాలా కష్టమైనప్పటికీ, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో పిల్లల్ని చేర్పించాలనుకొనేవారు కేంద్రీయ విద్యాలయ ప్రవేశ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో తమ పిల్లల్ని చేర్చాలనుకొంటున్న తల్లిదండ్రుల కోసం కొన్ని విశేషాలివిగో!
- దేశవ్యాప్తంగా 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sanghatan)కింద పనిచేస్తాయి. పిల్లలకు నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్యనందించడమే వీటి లక్ష్యం. ఇక్కడ కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆటలు, ఇతర కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
- కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లల వయసు కనీసం ఆరేళ్లు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న విద్యార్థుల అడ్మిషన్ ఫారమ్‌లను తిరస్కరిస్తారు.
- ఏప్రిల్ 1 నాటికి ఆరేళ్లు నిండిన విద్యార్థుల దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. 9, 11 తరగతుల్లో నమోదు చేసుకొనే విద్యార్థులకు కనిష్ఠ లేదా గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ లేదు.
- ప్రవేశ దరఖాస్తుల్లో ఏ చిన్న లోపం ఉన్నట్లు పరిశీలనలో తేలినా అడ్మిషన్ నిరాకరిస్తారు. అందుకే దరఖాస్తు నింపేటప్పుడు తప్పుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- భారత్‌తో పాటు కాఠ్‌మాండూ, మాస్కో, టెహ్రాన్‌లలోనూ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ పాఠశాలలే.
- తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 71 కేవీలు ఉండగా.. ఏపీలో 36 తెలంగాణలలో చెరో 35 చొప్పున ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకేరకమైన సిలబస్‌ను అనుసరించడం వల్ల బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లలకు చదువులో ఇబ్బంది తలెత్తదు.
- తరగతుల వారీగా ఉండే నామమాత్రపు ఫీజులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు తదితర అప్‌డేట్స్‌ను తల్లిదండ్రులు కేవీ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/లో తెలుసుకోవచ్చు.
- ఈ స్కూళ్లను తొలుత భారత రక్షణ దళాల్లోని సైనికుల పిల్లల కోసం స్థాపించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ప్రజలకు సైతం అవకాశం కల్పిస్తున్నారు.