students must have these skill for job placements | ప్లేస్‌మెంట్స్‌లో ఏమేం చూస్తారు? ఈ స్కిల్స్‌ తప్పనిసరా?!

Job Placements : ప్లేస్‌మెంట్స్‌లో ఏమేం చూస్తారు? ఈ స్కిల్స్‌ తప్పనిసరా?!

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభ్యర్థుల్లో ఎలాంటి నైపుణ్యాలు ఉండాలంటే..?

Published : 02 June 2024 18:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ పోటీ ప్రపంచంలో మేటి సంస్థల్లో జాబ్‌ కొట్టడం అభ్యర్థులకు ఎంత కష్టమో..  తమ సంస్థని సమర్థంగా నడిపించే మానవ వనరుల్ని ఎంపిక చేసుకోవడం యాజమాన్యాలకూ అంతే పెద్ద సవాల్‌. అందుకే రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొన్నవారిలో తమ సంస్థకు నప్పే నైపుణ్యాలున్న వారి వైపే  ఆయా సంస్థలు మొగ్గుచూపుతాయి.  కేవలం సబ్జెక్టు పరిజ్ఞానం ఉంటే సరిపోదు.. లోకజ్ఞానంతో పాటు కొన్ని నైపుణ్యాలూ అవసరమే. అందువల్ల ఉద్యోగార్థులు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలివే..

  • ఈ డిజిటల్‌ యుగంలో సాంకేతికపరమైన నైపుణ్యాల్లేకపోతే కెరీర్‌లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేం. చురుగ్గా ఉండటంతో పాటు శరవేగంగా వస్తోన్న మార్పులకనుగుణంగా కొత్త కోర్సులు, టూల్స్‌ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. నిర్ణయాలు తీసుకోవడంలో చురుగ్గా వ్యవహరిస్తూ గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి వ్యవహరించగలిగే  శైలి మేలు చేస్తుంది. ఇతరుల అనుభవాల నుంచీ నేర్చుకోగల సామర్థ్యాన్ని అలవరుచుకోవాలి.
  • క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన ప్రతి అభ్యర్థికీ ఆ సంస్థలో పెద్ద స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయి. అయితే మార్పులను అర్థం చేసుకుంటూ తమ నైపుణ్యాలను అప్‌డేట్‌ చేసుకునేవారికే ఈ అవకాశాలెక్కువ. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలనుకున్న విద్యార్థుల్లో చాలామంది దృష్టి ఆ సంస్థలో ఉద్యోగిగా ఎంపికవడం వరకే పరిమితమవుతుంది. అందుకు అవసరమైన శిక్షణ తీసుకుని, తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇది స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అభ్యర్థిలోని ఈ వైఖరి ఉన్నత స్థాయికి చేరడానికి ఏమాత్రం పనికిరాదు.
  • ఇతరులతో కలిసి పనిచేసే సమయంలో వారితో ప్రవర్తించే తీరు, సంభాషణలు, నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వత కలిగిన ప్రవర్తన కనిపించాలి. ప్రతి సంఘటననూ అర్థం చేసుకుని, నేర్చుకుని తదుపరి కార్యాచరణ చేయగలిగిన సామర్థ్యం ఉద్యోగ సాధనకు మేలు చేస్తుంది.
  • ఉద్యోగంలో చేరాక ఇతరులకంటే భిన్నమైన నైపుణ్యాలున్నవారు ‘ఫాస్ట్‌ట్రాక్‌ కేటగిరీ’లో ఉంటూ సంస్థలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలెక్కువ. వర్క్‌ కల్చర్‌ని గ్రహించి వృత్తిని ప్రేమించే వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ఇలాంటి అభివృద్ది వ్యక్తిగత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. వృత్తి, సంస్థల పట్ల అంకిత భావంతో పనిచేసేవారిని ఏ సంస్థా వదులుకోదు. మీ పైఅధికారుల్ని పనితీరుతో ఇంప్రెస్‌ చేయగలిగే తీరు మరింత ప్రయోజనకరం. 
  • నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, ప్రతి పనినీ అందరికంటే భిన్నంగా చేయగలిగే వారికే సంస్థలు ప్రాధాన్యమిస్తుంటాయి. ఉద్యోగం వచ్చింది కదా చాల్లే.. ఇంకేం నేర్చుకుంటాంలే.. అనే ధోరణి మీ కెరీర్‌నే ప్రమాదంలోకి నెడుతుందని మరిచిపోవద్దు. నిరంతరం నేర్చుకునే తత్వం కలిగిన విద్యార్థులు.. ఉద్యోగం వచ్చాకా కొత్త విషయాలు నేర్చుకోవటం కొనసాగిస్తారు. ఇలాంటివారికే నియామకాల్లో మొగ్గు ఉంటుంది. కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది.
  • అకడెమిక్‌లో, ఇతర ఎంపిక ప్రక్రియల్లో నెగ్గాక ఇంటర్వ్యూ ప్యానెల్‌ను ఎలా ఆకట్టుకుంటున్నారనేది కీలకం. మొదటి చూపులోనే తాము ఎదురుచూస్తున్న అభ్యర్థి మీరేనన్న అభిప్రాయం సెలక్టర్లకు కల్పించగలగాలి. అదే మీ ప్రాథమిక ఉద్దేశం కావాలి. అది మీ ఇతర అంశాలతో పాటు వస్త్రధారణలోనూ కనిపిస్తుంది. చాలామంది అలక్ష్యం చేసే అంశాల్లో ప్రొఫెషనల్‌ వస్త్రధారణ ఒకటి.
  • ప్రాంగణ నియామకాల్లో ఆయా సంస్థల బాధ్యులు తమ సంస్థ ప్రొడక్ట్‌, మార్కెటింగ్‌, విజన్‌, మిషన్‌ లాంటివి ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ ప్రజెంటేషన్‌పై విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపాలి. చాలా సందర్బాల్లో విద్యార్థుల ఆసక్తినీ, శ్రద్ధనూ తెలుసుకు నేందుకు ప్రజెంటేషన్‌లోని అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగవచ్చు. విద్యార్థుల పరిశీలన, అప్రమత్తత, ఆసక్తులను వెల్లడించే అంశమిది. ఇలాంటివాటిలో ముందున్న విద్యార్థులపై రిక్రూటర్లకు నమ్మకం పెరుగుతుంది.