TG Inter Hall tickets | తెలంగాణ ఇంటర్ హాల్‌టికెట్లు.. నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండిలా!
తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్లు(TG Inter Hall tickets) విడుదలయ్యాయి.
By Education News Team
Updated :23 Feb 2026 20:27 IST
https://results.eenadu.net/education-news/TG-Inter-halltickets-released
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు (Inter Exams) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల కళాశాలల లాగిన్‌లలో అందుబాటులో ఉంచిన హాల్‌టికెట్లను(TG Inter Hall tickets).. ఇప్పుడు విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో లింక్‌లను అందుబాటులో ఉంచారు. ప్రథమ ఇంటర్ విద్యార్థులైతే తమ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టికెట్లను పొందొచ్చు. అలాగే, ద్వితీయ ఇంటర్ విద్యార్థులైతే రోల్ నంబర్/గతేడాది హాల్‌టికెట్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను; బ్రిడ్జి కోర్సు విద్యార్థులు సైతం తమ వివరాలను ఎంటర్ చేసి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు 1495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 4,89,126 మంది ప్రథమ ఇంటర్ విద్యార్థులు కాగా.. 5,07,949 మంది ద్వితీయ ఇంటర్ (రెగ్యులర్/ప్రైవేటు) విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లలో పేరు, సబ్జెక్టు పేరు తదితర వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. వీటిలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది. హాల్‌టికెట్లలో ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చని తెలిపింది. విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌ను పంపించి డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కూడా కల్పించినట్లు బోర్డు పేర్కొంది.