TGPSC Results | ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. జనరల్ ర్యాంకింగ్స్ ఇవిగో!
తెలంగాణలోని మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :19 Mar 2025 16:31 IST
https://results.eenadu.net/news.aspx?newsid=tgpsc-extension-officer-results-19032025
TGPSC Results | హైదరాబాద్: తెలంగాణలోని మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 6, 7 తేదీల్లో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ(TGPSC) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు మెరిట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 181 గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనవరి 7న పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. అదే నెల 16న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. జనవరి 17 నుంచి 19వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలతో పాటు తుది కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసింది.
జనరల్ ర్యాంకింగ్ జాబితా కోసం క్లిక్ చేయండి
ఈ ఉద్యోగ ఖాళీలకు రాష్ట్ర వ్యాప్తంగా 26,751 మంది దరఖాస్తు చేసుకోగా.. మూడు పేపర్లను కలిపి 10,459 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరందరి జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ ర్యాంకుల జాబితాతో పాటు తుది కీ, రెస్పాన్స్ షీట్‌లు వెబ్‌సైట్‌లో మార్చి 19 నుంచి ఏప్రిల్ 17వరకు అందుబాటులో ఉంటాయని.. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. జనరల్ ర్యాంకుల ఆధారంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలవనున్నారు. ఆ అభ్యర్థులకు వ్యక్తిగతంగా, టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా సమాచారం ఇస్తారు. అందువల్ల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే.. టీజీపీఎస్సీ హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్లు 040-23542185/ 040-23542187 లేదా helpdesk@tspsc.gov.inకు ఈమెయిల్ ద్వారా సంప్రదించవ్చని సూచించారు.