NCHM JEE 2026 | ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
ప్రఖ్యాత సంస్థల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE) దరఖాస్తుల గడువును ఎన్‌టీఏ పొడిగించింది.
By Education News Team
Updated :19 Jan 2026 19:57 IST
https://results.eenadu.net/news.aspx?newsid=NCHM JEE application 2026 deadline extended
ఇంటర్నెట్ డెస్క్: ఆతిథ్య రంగంలో ప్రవేశించాలనుకొనే విద్యార్థులకు గుడ్‌న్యూస్! ప్రఖ్యాత సంస్థల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM - JEE 2026) దరఖాస్తుల గడువును ఎన్‌టీఏ(NTA) పొడిగించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జనవరి 25తో ముగుస్తుండగా.. దాన్ని మార్చి 25వరకు పొడిగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకొనే విద్యార్థులకు NCHM - JEE 2026 అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. అయితే, ఎక్కువ మంది విద్యార్థులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
ఆన్‌లైన్ దరఖాస్తులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాతీయ స్థాయి పరీక్ష ఏప్రిల్ 25 (శనివారం) జరగనుంది. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ప్రశ్న పత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి మొత్తం స్కోరు నుంచి ఒక మార్కు కోత విధిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నిర్వహించే నగరాలివే..
ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు చేయడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 011-40759000 ఫోన్ నంబర్ లేదా nchm@nta.ac.inకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ఎన్‌టీఏ సూచించింది.