Tips for students to study long hours I ఎక్కువ సేపు చదవలేకపోతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

Study Tips: ఎక్కువ సేపు చదవలేకపోతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

పుస్తకం పట్టుకొని ఎక్కువసేపు చదవలేకపోతున్నారా..? ఇవిగో ఈ చిట్కాలు మీకోసమే..

Published : 29 May 2024 09:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పుస్తకం పట్టుకొని కాసేపు చదవగానే నిద్ర రావడమో, ఏదోఒక అంశం పైకి దృష్టి మళ్లడమో, అలసిపోవడమో సర్వసాధారణం. స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకి వచ్చాక  ఏకాగ్రతతో చదవడం మరింత సవాలుగా మారింది. చదివే సమయంలో ఎదురయ్యే ఆటంకాల్ని అధిగమించి అనుకున్న లక్ష్యం వైపు వెళ్లాలంటే చాలా శ్రమించాలి. ఎక్కువ గంటలు చదివి మంచి స్కోరు సాధించేందుకు ఈ చిట్కాలను ఓసారి ట్రై చేయండి.

  • రోజులో మీకు ఉన్న సమయం ఆధారంగా ఒక షెడ్యూల్‌ను రూపొందించుకోండి. రోజుకు ఎన్ని గంటలు చదవాలి? ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. దాని ఆధారంగా ఒక టైం టేబుల్‌ను తయారుచేసుకొని మీకు కనబడేలా పెట్టుకోండి.
  • మీ చుట్టూ నిశ్శబ్ధ వాతావరణం ఉండేలా చూసుకోండి.  మీరు చదివే ప్రదేశాన్ని మంచి వెలుతురుతో సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుకోండి. ప్రతిసారీ లేచేందుకు వీల్లేకుండా తాగునీటితో పాటు మీకు అవసరమైన  మెటీరియల్‌ అందుబాటులో ఉంచుకోండి. 
  • పొమోడోరో టెక్నిక్‌ వంటి సాంకేతిక పద్ధతుల్ని పాటించండి. మధ్య మధ్యలో లేస్తూ చిన్న విరామాలు తీసుకోండి. 25 నిమిషాల పాటు చదివి.. ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోవడం వంటి చిట్కాలు మేలు చేస్తాయి. 
  • ప్రతీ సెషన్‌లో మీరు ఏ సబ్జెక్టును, ఎంతమేరకు చదవాలనుకుంటున్నారో ముందే నిర్దేశించుకోండి. చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని ప్రణాళిక ప్రకారం చదవండి.  అనుకున్నదాన్ని ఎంతమేరకు పూర్తి చేయగలుగుతున్నారో మీరు సాధించే పురోగతిని ట్రాక్‌ చేస్తూ ఉండండి.
  • చదివే సమయంలో మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉండండి. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి. శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోండి.
  • ఇది స్మార్ట్‌ఫోన్‌ల యుగం. ఫోన్‌ లేకుండా ఉండటం కష్టమే. కానీ, ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లు, సామాజిక మాధ్యమాలు మీ ఫోకస్‌ని దెబ్బతీస్తాయి. లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం.  ఒకసారి ఒక పనిపైనే దృష్టిస్తూ మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి.