NEET Re-Revised Results I నీట్-యూజీ రీ-రివైజ్డ్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డుల కోసం క్లిక్ చేయండి
నీట్ రీ-రివైజ్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. స్కోర్‌కార్డును ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Published :26 July 2024 18:45 IST
https://results.eenadu.net/news.aspx?newsid=26072024
NEET Revised Results| దిల్లీ: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ (యూజీ) పరీక్ష రీ-రివైజ్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ పరీక్షలో కొనసాగిన తీవ్ర వివాదం (NEET Row)పై విచారణను ముగించి సుప్రీంకోర్టు (Supreme court) ఇటీవల తీర్పు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఎన్‌టీఏ (NTA) అధికారులు రీ-రివైజ్డ్ స్కోర్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 5న జరిగిన నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. తొలుత విడుదల చేసిన ఫలితాలతో పోలిస్తే.. టాపర్ల సంఖ్య భారీగా తగ్గింది. సవరించిన ఫలితాల్లో 720/720 మార్కులు కేవలం 17మందికి మాత్రమే వచ్చాయి. టాపర్లలో 13మంది అబ్బాయిలు కాగా.. నలుగురు అమ్మాయిలు ఉన్నారు.
రీ-రివైజ్డ్ స్కోర్ కార్డుల కోసం క్లిక్ చేయండి
కాంపెన్సేటరీ మార్కులపై ‘సుప్రీం’ తీర్పు
ఫిజిక్స్ విభాగంలోని ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. అటామిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయని, వాటిలో దేన్ని ఎంపిక చేసినా.. మార్కులిచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సర్వోన్నత న్యాయస్థానాన్ని (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, నివేదిక అందించాలని ఐఐటీ-దిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే సంబంధిత ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని, రెండు లేవని... దానికి ఆప్షన్ 4 ఒక్కటే సమాధానమని పేర్కొంటూ ఆ కమిటీ న్యాయస్థానానికి నివేదించింది. దీంతో ఆప్షన్ 4ను ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం ఎన్‌టీఏకు ఆదేశాలివ్వడంతో నీట్ ఫలితాలను సవరించి విడుదల చేయడం అనివార్యంగా మారింది.
నీట్ రివైజ్డ్ తుది కీ కోసం క్లిక్ చేయండి
నీట్ పరీక్షపై దుమారం ఇలా..
మే 5న జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం పేపర్ లీకేజీ, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తీవ్ర దుమారం కొనసాగిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే (జూన్ 4న) ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేయడం, 67మంది విద్యార్థులు 720/720 స్కోరుతో టాపర్లుగా నిలవడం వంటి పరిణామాలు అనుమానాలను రేకెత్తించాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తోన్న సీబీఐ అధికారులు.. ఇప్పటికే పలువురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలతో ఈ పరీక్షను రద్దుచేయాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. ఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పరిమితమైందేనని.. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.