JEE Main 2025 Applications|జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో సవరణకు ఛాన్స్.. కానీ, ఈ వివరాల్ని మార్చలేం!
జేఈఈ మెయిన్ (JEE Main 2025)కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఎన్‌టీఏ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది.
Published :19 Nov 2024 15:33 IST
https://results.eenadu.net/news.aspx?newsid=19112024
JEE Main 2025| ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Main 2025)కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఎన్‌టీఏ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Session-I) పరీక్షకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు.. తాము సమర్పించిన దరఖాస్తు వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే నవంబర్ 26 నుంచి 27వ తేదీ రాత్రి 11.50గంటల వరకు సరి చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి!
ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్ (శాశ్వత/ప్రస్తుత), ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి మాత్రం అవకాశం లేదని NTA స్పష్టం చేసింది. అభ్యర్థి పేరు/తండ్రి పేరు/తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్ కార్డు నంబర్, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకొనేందుకు ఛాన్స్ ఇస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు అభ్యర్థి పుట్టిన తేదీ, లింగం, కేటగిరీ, సబ్ కేటగిరీ/పీడబ్ల్యూడీ, సంతకం మార్పుకొనేందుకు సైతం అవకాశం ఉంటుందని తెలిపింది.
జేఈఈ మెయిన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో తప్పులను సరిచేసుకొనేందుకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుందని, అందువల్ల దీన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా సవరణలు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు, జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు 22తో ముగియనుంది. దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం లేదని, అందువల్ల త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.