JEE Main 2026 preparation| తొలి ప్రయత్నంలోనే మెరిసేలా.. ‘జేఈఈ మెయిన్‌’కు ప్రిపరేషన్‌ ఇలా!

JEE Main 2026 preparation| తొలి ప్రయత్నంలోనే మెరిసేలా.. ‘జేఈఈ మెయిన్‌’కు ప్రిపరేషన్‌ ఇలా!

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌/బీఆర్క్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) పరీక్షకు సమయం సమీపిస్తోంది.

Eenadu icon
By Education News Team Published :16 Dec 2025 15:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌/బీఆర్క్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) పరీక్షకు సమయం సమీపిస్తోంది. ఎంతో కఠినంగా ఉండే ఈ పరీక్షలో పక్కా ప్రణాళిక, తగిన సన్నద్ధతతో ముందుకెళ్తే విజయం సులువేనంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పరీక్షకు ముందు హడావుడిగా చదివి ఒత్తిడికి గురికాకుండా స్థిరమైన ప్రిపరేషన్‌, ఓర్పు, తగినంత కృషితో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.  జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ప్రారంభం కానుండటంతో అభ్యర్థులు ఇప్పట్నుంచే తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెడితే మొదటి ప్రయత్నంలోనే సాధించొచ్చంటున్నారు. (JEE Main 2026 prepration)

  • పరీక్షకు ముందు ఉన్న ఈ కొద్ది సమయంలో ప్రాక్టీసుపైనే నిరంతరం ఫోకస్‌ పెట్టండి. కనీసం 10 ఏళ్ల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేసేందుకు ప్రయత్నించండి. తద్వారా మీకు పరీక్ష సరళి అర్థం కావడంతో పాటు తరచూ పరీక్షల్లో అడిగే కాన్సెప్టులేంటో అవగతం చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ పరీక్షలో సబ్జెక్టుపై మీ అవగాహనకు పరీక్షే తప్ప మెమరీకి కాదని గుర్తుంచుకోండి.
  • జేఈఈ పరీక్ష ప్రశ్నపత్రంలో అడిగే ప్రశ్నలను ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రిపరేషన్‌ సమయంలో ఫార్ములాలను బట్టీ పట్టొద్దు.. కాన్సెప్టులపైనే దృష్టి పెట్టండి. ప్రతి టాపిక్‌పైనా పట్టు సాధించేలా ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) పుస్తకాలను లోతుగా చదవండి.
  • థియరీ, కాన్సెప్టులను క్షుణ్ణంగా చదివితే మంచి స్కోరు చేసే వీలుంటుంది. అందువల్ల కాన్సెప్టులపై స్పష్టత ఏర్పరుచుకోండి. ప్రిపరేషన్‌ కోసం ప్రామాణిక పుస్తకాలనే ఎంచుకోండి. పరీక్షలకు ముందు కొత్త పుస్తకాలను చదివి అయోమయానికి గురికావొద్దు. 
  • ప్రిపరేషన్‌కు చేసే సబ్జెక్టులో కొన్ని టాపిక్స్‌ను ఎంచుకొని వారంలోనే వాటిని పూర్తి చేసేలా స్వల్ప కాలిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.  వీక్లీ గోల్స్‌ పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించడం ద్వారా మీ ముందున్న కొండంత లక్ష్యాన్ని కరిగించగలుగుతారు.
  • మాక్‌ టెస్టులను పూర్తిగా సాల్వ్‌ చేసేందుకు ప్రయత్నించండి.  రెగ్యులర్‌గా, స్థిరంగా వీటిని కొనసాగించడం ద్వారా పరీక్షలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. రాసిన ప్రతి మాక్‌ టెస్టును లోతుగా విశ్లేషించుకోండి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లను గుర్తించండి. ఎక్కడ వెనకబడి ఉన్నారో, ఎక్కడ సమయం వృథా అవుతుందో గుర్తించి తదనుగుణంగా మీ తదుపరి ప్రిపరేషన్‌కు ప్లాన్‌ చేసుకోండి. 
  • చదువుతున్న సమయంలోనే షార్ట్‌ నోట్స్‌ను ప్రిపేర్‌ చేసుకోండి. త్వరగా రివిజన్‌ చేసేందుకు వీలుగా ఫార్ములా షీట్లను తయారు చేసుకోండి. ముఖ్యమైన పాయింట్లు కవర్‌ అయ్యేలా బుల్లెట్‌ పాయింట్లుగా రాసుకోండి. తద్వారా పరీక్షకు ముందు మీరు ఆయా టాపిక్‌లను త్వరగా ఒకసారి రివిజన్‌ చేసుకొనేందుకు వీలవుతుంది.
  • మీ సమయానుకూలంగా క్విజ్‌లు వంటివి పెట్టుకొని మీకు మీరే ఓ పరీక్ష వాతావరణాన్ని సృష్టించుకోండి. తద్వారా పరీక్షల ఒత్తిడి తగ్గడంతో పాటు మీ ప్రాక్టీసూ ప్రిపరేషనూ మరింత మెరుగుపడుతుంది.ఈ తరహా ప్రిపరేషన్‌తో మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సబ్జెక్టుపై పట్టూ ఏర్పడుతుంది.
  • జేఈఈ మెయిన్‌ పరీక్షలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి.  అధిక వెయిటేజీ ఉన్న టాపిక్స్‌ (ఉదా: మోడర్న్‌ ఫిజిక్స్‌, థర్మోడైనమిక్స్‌ వంటివి), స్కోరింగ్‌ ఉన్న టాపిక్స్‌కు మీ ప్రిపరేషన్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి. రోజూ మీ అధ్యయనం స్థిరంగా కొనసాగించేలా చూసుకోండి. క్రమం తప్పకుండా రోజూ కొన్ని గంటల పాటు ఫోకస్‌ పెట్టి చదివితే గెలుపు సులువే.