CLAT 2026 Results | క్లాట్ 2026 ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్ కార్డు పొందండిలా!
ప్రతిష్ఠాత్మక న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Updated :16 Dec 2025 19:51 IST
https://results.eenadu.net/news.aspx?newsid=16122025-clat-result
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2026 Results) ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రవేశాల కోసం డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా క్లాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష తుది కీతో పాటు ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి స్కోర్ కార్డును పొందొచ్చు.
క్లాట్ 2026 స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
దేశ వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 96.01శాతం హాజరు నమోదు కాగా.. వీరిలో 57శాతం అమ్మాయిలు.. 43శాతం అబ్బాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులందరూ అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ సంస్థ తెలిపింది. ఇందుకోసం గైడ్‌లైన్స్‌ను సైతం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. నేషనల్ లా వర్సిటీల కన్సార్షియం తరఫున బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నల్సార్ వర్సిటీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీలో సీట్లనూ ఈ పరీక్ష ర్యాంకర్లతోనే భర్తీ చేస్తుంటారు.