TGPSC గ్రూప్‌ -4 | గ్రూప్‌- 4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు సిద్ధమేనా?

TGPSC: గ్రూప్‌- 4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు సిద్ధమేనా?

తెలంగాణలో గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూన్‌ 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభం కానుంది.

Published : 17 June 2024 16:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రంగం సిద్ధమైంది.  జూన్‌ 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (TGPSC) ఆదివారం వెల్లడించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతో పాటు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. నిర్దేశిత తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో చేపట్టే ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్ల వారీగా జాబితాలను విడుదల చేశారు. ఎవరైనా అనివార్య కారణాల వల్ల గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలించనున్నారు. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5గంటల తర్వాత వెరిఫికేషన్‌కు అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డా. నవీన్‌ నికోలస్‌ స్పష్టం చేశారు. 

పూర్తి షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.  మరి ఇవి సిద్ధం చేసుకున్నారా?

  • మీ ప్రాథమిక వివరాలు నింపిన చెక్‌లిస్ట్‌ (చెక్‌లిస్ట్‌ కోసం క్లిక్‌ చేయండి)
  • మీ దరఖాస్తు ఫారం (2 కాపీలు)
  • పరీక్ష హాల్‌టికెట్‌
  • పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎస్‌సీ మెమో)
  • ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం
  • మీ విద్యార్హతలకు సంబంధించిన ప్రొవిజినల్‌, కాన్వొకేషన్‌ సర్టిఫికెట్‌, మార్కుల మెమో (గ్రాడ్యుయేషన్‌/పీజీ)
  • తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం (తండ్రి లేదా తల్లి పేరుతో మాత్రమే ఉండాలి)
  • బీసీ నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్‌ (ఓబీసీ సర్టిఫికెట్‌లను అనుమతించరు)
  • వివాహిత మహిళలకు ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనిటీ సర్టిఫికెట్‌, నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్లు భర్త పేరుతో ఉంటే అనుమతి లేదు. 
  • ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులైతే 2021-22 ఏడాదితో ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి.
  • వయో సడలింపు పొందేందుకు మీరు సమర్పించిన వివరాలకు అవసరమైన ఆధారాలతో  ధ్రువీకరణపత్రాలు
  • దివ్యాంగ సర్టిఫికెట్‌ (సదరం సర్టిఫికెట్‌)
  • ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులైతే.. సంబంధిత సంస్థ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి.
  • గెజిటెడ్‌ అధికారి సంతకంతో ఉన్న రెండు అటిస్టేషన్‌ కాపీలు
  • నిరుద్యోగి అని పేర్కొనే డిక్లరేషన్
  • ఈ నోటిఫికేషన్‌లో కొన్ని ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక అర్హతలకు సంబంధించి కొన్ని సర్టిఫికెట్లు ఉండాలి. పోస్ట్‌ కోడ్‌ 70కి అప్లై చేసిన అభ్యర్థులు తాము హిందువు అని తెలిపే డిక్లరేషన్‌ తీసుకెళ్లాలి.
  • పోస్ట్‌కోడ్‌ 94, 95కు సంబంధించిన ఉద్యోగాలకైతే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ర్యాంక్‌కు తక్కువ కాని అధికారి నుంచి  ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తయారు చేయించాలి. 
  • ఇటీవల తీసుకున్న మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు సిద్ధం చేసుకోవాలి.