కెరీర్‌లో ఎదగాలంటే.. కావాల్సింది ఈ నైపుణ్యాలే!
సమయంతో పాటు వనరుల్ని సమర్థంగా వాడుకుంటేనే ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అనుకున్నంత సులభమేమీ కాదు.
Published : 13 June 2024 17:05 IST
https://results.eenadu.net/news.aspx?newsid=13062024
ఇంటర్నెట్ డెస్క్: పని చేసే రంగం ఏదైనా.. అందులో రాణించాలంటే నిర్వహణ నైపుణ్యాలే కీలకం. సమయంతో పాటు వనరుల్ని సమర్థంగా వాడుకుంటేనే ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అనుకున్నంత సులభమేమీ కాదు. స్పష్టమైన లక్ష్యం, కచ్చితమైన ప్రణాళిక వంటి సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించి గెలుపు బాటలో నడిపేందుకు కావాల్సిన కొన్ని నైపుణ్యాలివిగో..!
- మనం ఎంచుకొనే లక్ష్యాలు ఆచరణాత్మకంగా ఉండాలి. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలతో విలువైన సమయం వృథా తప్ప సాధించేదేమీ ఉండదు. లక్ష్య సాధనకు నిర్దిష్ట గడువుతో పాటు చక్కని ప్రణాళిక వేసుకుంటే.. అవే మిమ్మల్ని గెలుపు తీరాల వైపు ప్రేరేపిస్తాయి. ఎంచుకున్న లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి కాల పరిమితిని పెట్టుకుంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వడమే కాదు.. మీ సామర్థ్యమూ మెరుగవుతుంది.
- ప్రాధాన్యతల వారీగా పనిచేయడం చాలా అవసరం. ఈ వారానికి సంబంధించి మీ చేతిలో నాలుగైదు లక్ష్యాలుంటే.. వాటిలో ఏది ముఖ్యమో, ఏది ముందు చేయాలో, దేనికి ఎక్కువ సమయం కేటాయించాలో తెలుసుకొని ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న లక్ష్యాలను స్వల్ప వ్యవధిలోనే చేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకోండి.
- మీకు ఇచ్చిన పనిని ఏ విధంగా చేస్తే సకాలంలో, తక్కువ వనరులతో పూర్తి చేయగలరో అంచనా వేయగలిగితే.. మీకు నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లే! ఈ నైపుణ్యం మీలో ఉంటే పని అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయామనే బాధగానీ.. ఇలా కాకుండా అలా చేసి ఉంటే బాగుండేదేమోనని చింతించాల్సిన అవసరం గానీ ఉండవు. దీంతో పాటు మీలో కాన్ఫిడెన్స్ కూడా రెట్టింపవుతుంది.
- ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలావరకు పనుల్ని టీమ్‌తో కలిసి చేయాల్సి వస్తుంది. ఇందుకోసం మీకు భావవ్యక్తీకరణ నైపుణ్యాలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలూ ఎంతో అవసరం. ఒక్కోసారి టీమ్‌లీడర్‌గా నాయకత్వం వహించాల్సి వస్తే సిద్ధంగా ఉండగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే బాగా రాణించగలుగుతారు.
- మీ లక్ష్యసాధనకు అవసరమైనవన్నీ అందుబాటులో ఉంచుకోండి. అది సమాచారమైనా, వస్తువులైనా. కంప్యూటర్‌లో సమాచారాన్ని, డెస్క్‌లో ఫైల్స్‌ను ఒక క్రమపద్ధతిలో పెట్టుకున్నట్లయితే.. మీకు అవసరమైనప్పుడు సకాలంలో సులభంగా తీసుకోగలగడం ద్వారా సమయం వృథా కాదు.