The Alchemist | కల... నిజమవుతుంది!

The Alchemist | కల... నిజమవుతుంది!

‘మనం ఏదైనా సంకల్పించుకుంటే దాన్ని నెరవేర్చడానికి విశ్వమంతా ఒక్కటవుతుంది... కాబట్టి గట్టిగా కోరుకో’ అంటాడు ఒక సినిమాలో షారుక్‌ ఖాన్‌.

Published :12 Oct 2024 17:12 IST

The Alchemist| ‘మనం ఏదైనా సంకల్పించుకుంటే దాన్ని నెరవేర్చడానికి విశ్వమంతా ఒక్కటవుతుంది... కాబట్టి గట్టిగా కోరుకో’ అంటాడు ఒక సినిమాలో షారుక్‌ ఖాన్‌. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆ మాట ‘ది ఆల్కెమిస్ట్‌’ అనే పుస్తకంలోది. స్వయంగా రచయితే తాను రాసిన మాట ఎంతవరకూ నిజమవుతుందో చూద్దామని ప్రయత్నించిన నేపథ్యం ఈ నవలది. అసలు కథేంటంటే..

కథానాయకుడు శాంటియాగో టీనేజ్‌ కుర్రాడు. మంచి చదువరి. అయితే తండ్రి కోరిక ప్రకారం మతప్రచారకుడు కాకుండా ప్రపంచ పర్యటన చేసి జీవితపాఠాలు నేర్చుకోవాలనుకుంటాడు. గొర్రెల్ని మేపుతూ వాటి ఉన్నిని అమ్మి వచ్చిన డబ్బునే దారి ఖర్చులకోసం వినియోగిస్తూ పర్యటన ప్రారంభిస్తాడు. ఈజిప్టు పిరమిడ్ల దగ్గర నిధి ఉన్నట్లు అతడికి తరచూ ఒక కల వచ్చేది. దాన్ని నిజం చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయాణంలో అతడికి చిత్రమైన వ్యక్తులతో విచిత్రమైన అనుభవాలెన్నో ఎదురవుతాయి. కొత్త ప్రదేశంలో తన భాష మాట్లాడిన వ్యక్తిని నమ్మినందుకు ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటాడు. అయినా వెనుదిరగడు. ఒక పింగాణీ దుకాణంలో పనిచేస్తూ, యజమానికి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి మంచి సలహాలిస్తాడు. ఆయనిచ్చిన డబ్బు దాచుకుని తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు. దారిలో ఒక రసవాది పరిచయమవుతాడు. రసవాదానికి సంబంధించి అతడి దగ్గరున్న పుస్తకాలన్నీ చదువుతాడు. శాంటియాగోకి ప్రకృతి సంకేతాలను గమనించడం అలవాటు. ఎడారిలో ఒయాసిస్సు దగ్గర మజిలీ చేసినప్పుడు తమ మీద దాడి జరగబోతోందని తోటివారిని హెచ్చరిస్తాడు. అది నిజం కావడంతో వారంతా అతణ్ని గౌరవిస్తారు. ఓ అమ్మాయితో ప్రేమలో పడి, ఆమె కోసం అక్కడే ఉండిపోతానంటాడు శాంటియాగో. ప్రేమా పెళ్లీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కలల్ని నెరవేర్చుకునే అవకాశం మళ్లీ మళ్లీ రాదు, వెళ్లమంటుంది ఆ అమ్మాయి. మొత్తానికి పిరమిడ్ల దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ నిధి కోసం తవ్వబోతుంటే స్థానికులు అడ్డుకుంటారు. తానెక్కడినుంచి వచ్చిందీ, కలలో నిధి సంగతీ చెబుతాడు శాంటియాగో. అప్పుడు వాళ్లలో ఒకరు ‘నాకు మీ దేశంలోనే పాడుబడ్డ చర్చిలో నిధి ఉన్నట్లు కల వచ్చింది’ అని అంటాడు. తనకు కల వచ్చిందీ ఆ చర్చిలో పడుకున్నప్పుడే. దాంతో శాంటియాగో తిరిగి వెళ్లి నిజంగానే అక్కడున్న నిధిని సొంతం చేసుకుంటాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటాడు.

ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!

చదవడానికి మామూలు జానపద కథలా ఉన్నప్పటికీ కథనం మాత్రం ప్రతీకాత్మకంగా సాగుతూ పలురకాలుగా అన్వయించుకునే వీలు కల్పిస్తుంది. కలలను నిజం చేసుకోవడం మన చేతుల్లో పనేననీ, చాలాసార్లు మనం వెతుకుతున్నది మన సమీపంలోనే ఉంటుందనీ, నమ్మకమూ ధైర్యమూ వదలవద్దనీ... ఇలా ఎన్నో సందేశాలను ఇస్తుందీ నవల. పాలొ కొయిలో ‘ది ఆల్కెమిస్ట్‌’ని ప్రచురించాక ఏడాదైనా సరిగా అమ్ముడుపోలేదు. రచయితగా తన కెరీర్‌ ముగిసిందేమోనని ఆందోళన చెందుతున్నప్పుడు తాను పుస్తకంలో రాసింది ఎందుకు ఆచరించకూడదన్న ఆలోచన వచ్చింది. దాంతో పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించాడు. కాబట్టే ఈ పుస్తకం పలు భాషల్లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. రచయితకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది.

- మిహిర