CBSE Exams Tips | ఫోకస్.. స్టడీ.. రివిజన్..: సీబీఎస్‌ఈ పరీక్షల ప్రిపరేషన్‌కు చిట్కాలివిగో!

CBSE Exams Tips | ఫోకస్.. స్టడీ.. రివిజన్..: సీబీఎస్‌ఈ పరీక్షల ప్రిపరేషన్‌కు చిట్కాలివిగో!

సీబీఎస్‌ఈ (CBSE) 10, 12 తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 15 నుంచే ఈ పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రిపరేషన్‌లో పాటించాల్సిన కొన్ని మెలకువలు ఇవిగో!

Eenadu icon
By Education News Team Published : 11 Jan 2024 16:28 IST

CBSE Exams Preparation Tips | ఇంటర్నెట్‌ డెస్క్‌:  సీబీఎస్‌ఈ (CBSE) 10, 12 తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 15 నుంచే ఈ పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రిపరేషన్‌లో విద్యార్థులు మరింత కఠిన వ్యూహాలను అనుసరించడం అవసరం. సరైన ప్రణాళికతో సన్నద్ధతను కొనసాగిస్తే మంచి మార్కులు సాధించడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ఇంకొన్ని రోజుల్లో జరగనున్న సీబీఎస్‌ఈ బోర్డు పరీక్ష(CBSE Board Exams)ల్లో రాణించేలా ప్రిపరేషన్‌ కోసం కొన్ని చిట్కాలివే.. 

ఏకాగ్రత పెంచుకోండి..

ఎన్ని గంటలు కాదు.. ఎంత ఏకాగ్రతతో చదివారన్నదే ముఖ్యం. ముందుగా ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైమ్‌టేబుల్‌ రాసుకోండి. దాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించండి. సమయం ఉంది కదాని.. మర్నాడు చదువుకుందాంలే అనే ధోరణి మీకే చేటు. అందువల్ల ఏకాగ్రత పరిధిని పెంచుకుంటూ.. చక్కటి స్టడీ ప్లాన్‌తో ముందుకెళ్తే విజయం మీదే.  మంచి మార్కులు సాధించాలన్న సంకల్పానికి ఏకాగ్రత తోడైతే లక్ష్యాన్ని చేరుకోవడం సులువే. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే మీ మనసును సంపూర్ణంగా పుస్తక పఠనంపైనే లగ్నం చేయండి. ఏకాగ్రత సాధనకూ కొంత కృషిచేయాల్సి ఉంటుంది. 

సరైన రివిజన్‌.. సక్సెస్‌ మంత్రం

ఎప్పటికప్పుడు పాఠాలను చదివే విద్యార్థులకు పరీక్షలప్పుడు అంత ఆందోళన ఉండదు. కానీ, విద్యా సంవత్సరం పొడవునా సరదాగా గడిపి పరీక్షల సమయంలో ఇన్ని సబ్జెక్టులు చదవగలమా అనే ఆందోళన పడే విద్యార్థులు మాత్రం ఇకనైనా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే పరీక్షల్లో గట్టెక్కడం సులువు. రెగ్యులర్‌ పాఠ్యాంశాలను చదివేందుకు, పునశ్చరణ(రివిజన్‌)కు వేర్వేరు సమయాలను నిర్ణయించుకొని నిబద్ధతతో చదవాలి. సక్సెస్‌ మంత్రమైన రివిజన్‌ కోసం కచ్చితమైన టైం టేబుల్‌ను సిద్ధం చేసుకోవాలి. ఏవైనా సందేహాలు వస్తే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవడం ఉత్తమం. 

గ్రూప్‌ స్టడీ.. విజయానికి మెట్టు

కలిసి చదివే విధానం పరీక్షల్లో ఎంతో మేలు చేస్తుంది. గ్రూప్‌ స్టడీతో క్లిష్టమైన సబ్జెక్టులను ఒకరికొకరు సహాయం చేసుకొని ఉత్తమ ర్యాంకులు సాధించిన వారు అనేకమంది ఉన్నారు. గ్రూప్‌ స్టడీ ద్వారా తెలియని, క్లిష్టమైన అంశాలపై పరస్పరం చర్చించి పరిష్కారాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని స్పష్టంగా వివరించే చెప్పే నైపుణ్యమూ మీకు అలవడుతుంది. నేర్చుకునే ప్రక్రియ (Learning process)లో ఇలా కొత్త విధానాలూ, వ్యూహాలను సహ విద్యార్థుల నుంచి తెలుసుకోవచ్చు. 

గతాన్ని వదిలేయ్‌.. విశ్వాసంతో అడుగేయ్‌.. 

గతంలో వచ్చిన మార్కులను చూసి నిరుత్సాహపడొద్దు. బదులుగా, మీరు ఏయే సబ్జెక్టుల్లో/పాఠ్యాంశాల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించండి. వాటిపై మరింత సమయం వెచ్చించి, కసరత్తు చేసేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధ్యమే. అలాగని, రోజంతా పుస్తకాల ముందు కూర్చొని బట్టీపట్టడం కాకుండా.. అప్పుడప్పుడు కాసేపు ఆటలు ఆడటం, వాకింగ్‌ చేయడం, టీవీ చూడటం వంటి చర్యలతో ఉపశమనం పొందొచ్చు. ఏకధాటిగా చదవకుండా ప్రతి గంటకు 5-10 నిమిషాలు బ్రేక్‌ తీసుకోవడం అవసరం.

సమయపాలనతోనే.. విజయతీరాలకు..

సమయపాలన (Time Management) అనేది విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం. ఈ విషయంలో ఎంత జాగ్రతగా ఉన్నా.. ఒక్కోసారి టైం చాలడంలేదంటూ ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. అందువల్ల ఉన్న కొద్ది రోజుల సమయాన్ని ఎంత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకొని వినియోగించుకున్నామనేదే అత్యంత కీలకం. ఏయే సబ్జెక్టులకు ఎంత సమయం అవసరమో తగిన టైం టేబుల్‌ను రూపొందించుకొని చదివేందుకు ప్రయత్నించండి.