TGPSC Group-3 Halltickets | తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. కీలక సూచనలివే..!
తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల టికెట్లు విడుదలయ్యాయి
Published :10 Nov 2024 17:34 IST
https://results.eenadu.net/news.aspx?newsid=10112024
TGPSC Group 3 Exam Halltickets| హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ (TGPSC) అధికార వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచింది. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష ఉండనుంది. తెలంగాణలో దాదాపు 1380కి పైగా గ్రూప్-3 (Group-3) పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చాకోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత పీడీఎఫ్ రూపంలో హాల్‌టికెట్‌ను పొందొచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ టెట్ దరఖాస్తులు మొదలయ్యాయ్.. పూర్తి వివరాలివే..
అభ్యర్థులకు 10 కీలక సూచనలివే..
- గ్రూప్ 3 పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30గంటల లోపే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
- ఉదయం సెషన్‌లో 9.30గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది.
- హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే.. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23542185, 040-23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
- విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్, హాల్‌టికెట్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
- హాల్‌టికెట్లను ఏ4 సైజు పేజీపై ప్రింటు తీసుకోవాలి.
- ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో అన్ని ప్రశ్నలు ముద్రించారా? లేదా? చూసుకోవాలి.
- ఒకవేళ అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ప్రింట్ కాకుంటే మూడు పాస్‌పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకుని, పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు హామీపత్రం ఇవ్వాలి.
- తప్పుడు గుర్తింపు పత్రాలతో హాజరైనా, ఒకరి పేరిట మరొక అభ్యర్థి వచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
- సెలక్షన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, క్వశ్చన్‌పేపర్లు జాగ్రత్త చేసుకోవాలి.
- డూప్లికేట్ హాల్‌టికెట్లను తర్వాత జారీ చేయరని గుర్తుంచుకోండి.