నచ్చిన ఉద్యోగం కొట్టాలంటే ఐదు సోపానాలివిగో!
తగిన విద్యార్హతలు, నైపుణ్యాలున్నా ఈ పోటీ ప్రపంచంలో నచ్చిన జాబ్ కొట్టడం అంత ఈజీ కాదు.
Published : 10 July 2024 07:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=10072024
ఇంటర్నెట్ డెస్క్: ఈ పోటీ ప్రపంచంలో అన్ని అర్హతలున్నా.. నచ్చిన ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదు. కొందరికి క్యాంపస్‌లలోనే జాబ్స్ వచ్చేస్తాయి.. మిగిలిన వారు మాత్రం సొంత ప్రయత్నంపైనే ఆధారపడి ఓపికతో ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగం కోసం అన్వేషించే క్రమంలో ఎన్నో ఒడుదొడుకులు.. మరెన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొందరు అన్ని అర్హతలు, నైపుణ్యాలూ ఉన్నా తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటిని అధిగమించి కొన్ని టిప్స్ పాటిస్తే ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.. అవేంటో చూద్దామా!
- రెజ్యూమె నిత్యనూతనంగా ఉండాలి. ఏ ఇంటర్వ్యూకు రెజ్యూమె పంపినా.. కచ్చితంగా ఆ జాబ్ ప్రొఫైల్‌కు తగినట్టుగా మార్పులు, చేర్పులు చేసుకోవడం మరిచిపోవద్దు. మీ రెజ్యూమెలో ఆ ఉద్యోగానికి బాగా నప్పుతాయనుకొనే అంశాలనే హైలైట్ చేయడం, కీవర్డ్స్ అదనంగా జోడించడం, నప్పని అంశాల్ని తొలగించడమో, లేదంటే తక్కువ ప్రాధాన్యంతో చూపించడం వంటి మార్పులు చేయండి. కానీ, చాలా మంది ఒక్కటే రెజ్యూమెను పెట్టుకుని అన్నింటికీ దాన్నే పంపుతుంటారు. ఆరునెలలకో, ఏడాదికో గానీ దాన్ని అప్‌డేట్ చేయరు. నిరంతరం తాజాగా ఉంచేందుకు ప్రయత్నించడం మెచ్చిన ఉద్యోగాన్ని పొందేందుకు ఓ చక్కని ప్రయత్నమని మరిచిపోవద్దు.
- సాఫ్ట్‌వేర్ కంపెనీలు/ఇతర సంస్థల కెరియర్ పేజెస్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం అలవాటు చేసుకోండి. ఆసక్తి ఉన్న సంస్థల గురించి ఆన్‌లైన్‌లో వెతకడం, వాటి అధికారిక వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించడం, ప్రతిచోటా కెరియర్ పేజెస్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా ఆయా సంస్థల్లో ఏవైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే మీ మెయిల్‌కు సమాచారం వస్తుంది. మీ ప్రొఫైల్‌కు సరిపోయే ఉద్యోగాలైతే తక్షణమే దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీకు చాలా శ్రమ తప్పుతుంది.
- వివిధ ప్రఖ్యాత సంస్థలు నిర్వహించే హైరింగ్ కంటెస్ట్‌లలో పాల్గొనండి. అలా చేయడం ద్వారా మెరుగైన అవకాశాలు సాధించే ఛాన్స్ ఉంటుంది. హ్యాకర్ ఎర్త్, డీ2సీ వంటి కంపెనీలు తరచూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. హ్యాకథాన్స్, షార్ట్ టర్మ్ కోడింగ్ ఈవెంట్స్ వంటివి జరిగినప్పుడు కచ్చితంగా పాల్గొనేలా చూసుకోండి. దీనివల్ల ఏ కంపెనీలు ఈవెంట్లు నిర్వహిస్తున్నాయో వాటి నుంచి ఆ తర్వాత నేరుగా ఇంటర్వ్యూలకు పిలుపు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
- ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో కాంటాక్ట్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్ల పరిచయాలు పెంచుకోవడం చాలా అవసరం. ప్రత్యేకమైన ఈవెంట్లకు హాజరు కావడం వల్ల పరిచయాలు పెరగడంతో పాటు ఇతరులతో పోటీ పడుతుండటం వల్ల ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుంది. తద్వారా ఇంకా మనల్ని మనం ఏవిధంగా మెరుగుపరుచుకోవచ్చో, ఏయే నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుందో బోధపడుతుంది.
- తిరస్కారాన్ని తట్టుకోగలిగే సమర్థతను, మనో నిబ్బరాన్ని ఏర్పరచుకోవడం అత్యంత ముఖ్యం. ఎన్నో కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నా.. అసలు సమాధానమే రాకపోవచ్చు. అలా వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో, సరికొత్త ప్రయత్నాలతో ముందుకెళ్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.