JEE Advanced 2025 | జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు డేట్‌ ఫిక్స్‌.. పరీక్ష సిలబస్‌, పాత ప్రశ్నపత్రాలు ఇవిగో!

JEE Advanced 2025 | జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు డేట్‌ ఫిక్స్‌.. పరీక్ష సిలబస్‌, పాత ప్రశ్నపత్రాలు ఇవిగో!

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్ష మే 18న జరగనుంది.

Published :03 Dec 2024 15:26 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 (JEE Advanced 2025) పరీక్ష మే 18న జరగనుంది. ఈ విషయాన్ని ఐఐటీ కాన్పుర్‌ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే.  జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు. JEE Advanced 2025 పరీక్ష రెండు పేపర్లుగా రెండు సెషన్లలో నిర్వహిస్తారు. పేపర్‌ 1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; పేపర్‌ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి

పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారా? ఈ 6 పొరపాట్లు అస్సలు చేయొద్దు!

జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షకు సంబంధించిన సిలబస్‌తో పాటు 2007 నుంచి 2024వరకు పాత ప్రశ్నపత్రాలను ఐఐటీ కాన్పూర్‌ అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 17,695 బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశముంది. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పాత ప్రశ్నపత్రాల కోసం క్లిక్‌ చేయండి

ఈ నిబంధనలు తెలుసా? 

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు అక్టోబర్‌ 1, 2000న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకైతే ఐదేళ్ల పాటు సడలింపు ఉంటుంది. 
  • అభ్యర్థులు తప్పనిసరిగా 2023, 2024 లేదా 2025లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలు రాసి ఉండాలి. 
  • 2024లో ఏదైనా ఐఐటీలో ప్రిపరేటరీ కోర్సులో చేరిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఏ కారణంతోనైనా ఐఐటీలో చేరిన తర్వాత అడ్మిషన్‌ రద్దయిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అనర్హులు.