JEE Main 2025 Applications| జేఈఈ (మెయిన్‌) సెషన్‌-2 పరీక్ష.. దరఖాస్తులు షురూ

JEE Main 2025 Applications| జేఈఈ (మెయిన్‌) సెషన్‌-2 పరీక్ష.. దరఖాస్తులు షురూ

జేఈఈ మెయిన్‌ (సెషన్‌ 2) పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Eenadu icon
By Education News Team Published :01 February 2025 20:00 IST

JEE Main 2025 Session 2 Applications | ఇంటర్నెట్ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు/ఐఐఐటీలు/ఇతర ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బీటెక్‌/బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ (మెయిన్‌) (JEE Main 2025) సెషన్‌-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో సెషన్‌ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. పిబ్రవరి 1 నుంచి 25వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుందని ఎన్టీఏ(NTA) వెల్లడించింది. అర్హులైన, ఆసక్తికలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 25న రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జేఈఈ (మెయిన్‌) సెషన్‌-2 దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

  • దరఖాస్తు రుసుం: ఫిబ్రవరి 25 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు, అడ్మిట్ కార్డుల్ని తగిన సమయంలో విడుదల చేస్తారు.
  • పరీక్ష ఎప్పుడు?: జేఈఈ మెయిన్‌ పరీక్ష ఏప్రిల్‌ 1 - 8 మధ్య వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలను ఏప్రిల్‌ 17నాటికి ప్రకటించే అవకాశం ఉంది.
  • దరఖాస్తు ఇలా..: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్ష రాసిన విద్యార్థులు సైతం రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సెషన్‌-1లో సమర్పించిన అప్లికేషన్ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావొచ్చు.
  • పేపర్‌, పరీక్ష మీడియం, పరీక్ష రాయాలనుకొనే నగరం, విద్యార్హతలు వంటి వివరాలు నమోదు చేయడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా వివరాలేమీ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు.
  • గతంలో దరఖాస్తు చేసుకోని విద్యార్థులైతే.. నోటిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన బుక్‌లెట్‌లో వివరాలను చదివి అందులో సూచనల ఆధారంగా కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్లు నింపడానికి వీలులేదు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
  • హెల్ప్‌లైన్‌ ఇదే: దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 011-40759000/011-69227700 నంబర్లకు కాల్‌ చేయొచ్చు లేదా jeemain@nta.ac.in మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.
  • జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లలో పాల్గొన్న విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ ర్యాంకుల్ని ప్రకటిస్తుంది.
  • దేశంలోని 32 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, 40 ప్రభుత్వ ఉన్నత సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర కళాశాలల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ పరీక్ష ఏటా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో తగిన పర్సంటైల్‌ సాధించి సత్తా చాటిన వారు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు.