Job Skills for freshers: మీరు ఫ్రెషర్లా.. ఈ స్కిల్స్ ఉంటే కంపెనీలు మీకు రెడ్‌కార్పెట్!
నిత్యనూతనంగా ఆలోచించడం, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని దూసుకుపోయే తత్వం ఉన్న వారివైపే కంపెనీలు చూస్తున్నాయి. ఆ నైపుణ్యాలు మీలో ఉంటే రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తాయ్.
Published : 31 May 2024 17:40 IST
https://results.eenadu.net/news.aspx?newsid=31052024
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో మందగమనం కొనసాగుతోంది. ఈ ఏడాది ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలోనూ నిరాశాజనక వాతావరణమే కనబడుతోంది. దేశంలోని 23 ఐఐటీ క్యాంపస్‌ల్లో 38 శాతం మందికి ఉద్యోగాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. పరిశ్రమలకు కొత్త నైపుణ్యాలు అవసరం కావడంతో సాధారణ/సంప్రదాయ స్కిల్స్ ఉన్నవారికి జాబ్స్ దొరకడం సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ అవసరాలకు తగిన నైపుణ్యాలున్నవారిని మాత్రం కంపెనీలు వదులుకోవడంలేదు.
- నిత్యనూతనంగా ఆలోచించడం, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని దూసుకుపోయే తత్వం ఉన్న వారివైపే కంపెనీలు చూస్తున్నాయి. ఆ నైపుణ్యాలు మీలో ఉంటే రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తాయ్.
- పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా అభ్యర్థిలో నైపుణ్యాలుంటే కచ్చితంగా ఉద్యోగం వచ్చేసినట్లే! టీమ్‌లో అందరితో కలిసి పనిచేయడం, సమస్యలకు పరిష్కారాలు చూపగలగడం, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం వంటి సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మెథడాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి హార్డ్ స్కిల్స్ తెలిసి ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి.
- కాలేజీలో దశలో ఉన్నప్పట్నుంచే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలేంటో గమనిస్తుండాలి. అందుకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాల సాధనపై దృష్టిసారిస్తే బయటకు వచ్చాక ఉద్యోగం గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ ఆప్టిట్యూడ్‌తో పాటు డిజిటల్ టూల్స్, సాంకేతికత వినియోగంలో నైపుణ్యాన్ని పెంచుకోండి. అప్పుడే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి.
- గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్టులపై పట్టు ఉండటం ఒక ఎత్తు అయితే.. సమర్థంగా భావాలను వ్యక్తీకరించగలగడం, బృందంలో ఇమిడిపోయే మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు, కస్టమర్ సర్వీస్ వంటి సాంకేతికేతర నైపుణ్యాల్నీ అలవర్చుకోవడం అవసరం.
- మార్కెట్ అవసరానికి తగ్గట్టు ఉత్పత్తుల్ని, సేవల్ని అందించే కంపెనీలే ఎక్కడైనా రాణిస్తాయి. అందువల్ల అలాంటి కంపెనీలకు కావాల్సింది సవాళ్లను స్వీకరించి పనిచేసే నైపుణ్యం కలిగిన సిబ్బందే. ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులపై మేధోమథనం చేసి తగిన పరిష్కారాలు చూపేవారు, సమస్యా పరిష్కార ఆలోచనా దృక్పథం ఉన్న వారినే కంపెనీలు అక్కున చేర్చుకుంటాయి.