students must change these habits this summer vacation| వేసవి సెలవుల్లో ఈ అలవాట్లకు చెక్ పెట్టండి!
వేసవి సెలవుల్లో దొరికిన ఖాళీ సమయంతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. బడిగంట మోగడానికి ముందే యథావిథిగా చదువులపై దృష్టిసారించేలా తమను తాము సిద్ధం చేసుకోవాలి.
Published : 27 May 2024 16:45 IST
https://results.eenadu.net/news.aspx?newsid=27052024
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నాయి. వచ్చే నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బడి గంట మోగనుంది. పుస్తకాలు, పరీక్షలతో విద్యార్థులు బిజీబిజీ అయిపోతారు. వేసవి సెలవుల్లో తమకు నచ్చినట్లు గడిపిన విద్యార్థులు.. కొత్త అలవాట్లను మార్చుకోకపోతే కొంత ఇబ్బందుల్లో పడతారు. అందుకే విద్యా సంస్థలు మొదలయ్యేసరికి కొన్ని అలవాట్లు మార్చుకోండి.
- ఏడాదంతా చదువులతో గడిపిన విద్యార్థులు సెలవులు వస్తే ఎక్కువసేపు నిద్రపోవాలనుకుంటారు. నచ్చినంత సేపు టీవీలకు అతుక్కుపోవడంతో ఆలస్యంగా నిద్ర పోవడం, ఉదయం లేటుగా లేవడం వంటివి జరుగుతుంటాయి. ఇలా చేయడం వల్ల నిద్ర చక్రానికి (Sleep cycle) అంతరాయం కలుగుతుంది. తిరిగి విద్యా సంస్థలు మొదలైనప్పుడు అంతకుముందు సాధారణంగా ఉన్నవారి నిద్ర షెడ్యూల్‌ను మళ్లీ అడ్జెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకే ఇప్పట్నుంచే ఆ అలవాటుకు చెక్ పెట్టడం మంచిది.
- సెలవుల్లో కావాల్సినంత సమయం ఉంటుంది గనక పనుల్ని వాయిదా వేసినా తర్వాత చేసుకోగలరు. కానీ ఒకసారి విద్యాసంస్థలు మొదలయ్యాక వాయిదా పద్ధతి అలవాటైతే ఒత్తిడి, ఆందోళన తప్పదు. తద్వారా మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
- సెలవులప్పుడు టీవీలో సినిమాలు, ఇతర షోలు చూడటం తప్పేం కాదు.. కాకపోతే అదే పనిగా పెట్టుకుంటేనే ప్రమాదం. రోజంతా టీవీకి అతుక్కుపోయే అలవాటుకు ఫుల్‌స్టాప్ పెట్టండి. కాసేపు పుస్తకాలు తీయడం, ఆరుబయట గడపడం, స్నేహితులు, బంధువులతో కలిసి మాట్లాడటం వంటివి చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది.
- ఇంట్లో ఉంటే అదే పనిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. ఈ క్రమంలో జంక్ ఫుడ్స్ అలవాటుచేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి తినండి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం జోలికి వెళ్లే అలవాటు మానుకోండి.
- ఇప్పుడు సెలవులు కదా అని అస్సలు ఏమీ చదవకుండా ఉండొద్దు. మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచేందుకు, కొత్త విషయాలు నేర్చుకొనేందుకు పుస్తక పఠనం ఎంతో మేలు చేస్తుంది. కొన్ని నిమిషాలైనా ప్రతి రోజూ చదవడానికి కేటాయించుకోండి. కొత్త విషయాలు నేర్చుకోకపోతే వెనకబడిపోతారు. మీకు ఇష్టమైన, విజ్ఞానదాయకమైన షోలు, వీడియోలు చూడండి.
- సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపొద్దు. స్నేహితులు, కుటుంబంతో కనెక్ట్ చేసేందుకు ఇదో గొప్ప మార్గమే.. కానీ అదే పనిగా గంటల తరబడి అతుక్కుపోయే అలవాటుతోనే ప్రమాదం. స్కూళ్లు మొదలయ్యాక కూడా ఇదే అలవాటు ఉంటే చదువు ప్రమాదంలో పడుతుంది. అందుకే, సామాజిక మాధ్యమాలను వినియోగించేందుకు పరిమితమైన సమయాన్ని సెట్ చేసుకోండి. మిగతా సమయంలో ఇతర కార్యక్రమాలపైనా దృష్టి పెట్టండి.