IIT Madras Online Courses | విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ గోల్డెన్ ఛాన్స్.. ₹500కే ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు!
దేశంలోని పలు విద్యా సంస్థల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు అందించేందుకు ఐఐటీ మద్రాస్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే .ఈ దరఖాస్తులకు గడువు అక్టోబర్ 4తో ముగియనుండగా.. 10 వతేదీ వరకు పొడిగించింది.
Updated : 03 Oct 2024 19:42 IST
https://results.eenadu.net/news.aspx?newsid=23092024
IIT Madras|ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రసిద్ధిగాంచిన ఐఐటీ-మద్రాస్ (IIT Madras) విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఎనిమిది వారాల పాటు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒక్కో కోర్సుకు రూ.500 నామమాత్రపు రుసుంతో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి అధునాతన కోర్సులను బోధించనుంది. ఐఐటీ-మద్రాస్‌కు భాగస్వామిగా నమోదు చేసుకున్న పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ సదావకాశం కల్పిస్తోంది. ఆయా స్కూళ్లకు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించడం ద్వారా ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!
ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల గురించి 10 కీలక పాయింట్లు ఇవే..
- ఐఐటీ మద్రాస్‌లో ఇప్పటివరకు 450 పాఠశాలలలు భాగస్వాములుగా చేరగా.. 11వేల మందికి పైగా విద్యార్థులు పలు బ్యాచ్‌లలో వివిధ కోర్సులు నేర్చుకొని లబ్దిపొందారని ఐఐటీ మద్రాస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. భవిష్యత్తు తరాలను నిపుణులుగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని, విద్యార్థులు తమ అభిరుచులకు నప్పే కెరీర్ మార్గాన్ని ఎంచుకొనేందుకు ముందుగానే అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
- IIT Madras భాగస్వామ్య పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అక్టోబర్ నుంచి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు మొదలవుతాయి. ఇందుకోసం సెప్టెంబర్ 16 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ.. అక్టోబర్ 4తో ముగియనుండగా.. ఆ గడువును అక్టోబర్ 10వరకు పొడిగించింది. భాగస్వామిగా చేరాలనుకొనేందుకు అక్టోబర్ 5వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ కోర్సుకు బ్యాచ్‌లు అక్టోబర్ 21 నుంచి మొదలవుతాయని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది.
- డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు ఏ స్ట్రీమ్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సుకు మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్ అభ్యసిస్తున్నవారే అర్హులు.
- కోర్సులో భాగంగా.. 30 నిమిషాల నిడివితో రికార్డ్ చేసిన లెక్చర్ వీడియోలు ప్రతి సోమవారం విడుదల చేస్తారు. విద్యార్థులు వారంలో ఎప్పుడైనా వీక్షించే వీలు ఉంటుంది.
- నెలకు ఒకసారి శని/ఆదివారాల్లో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది.
- ఆన్‌లైన్ అసైన్‌మెంట్ రెండువారాలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు అసైన్ మెంట్‌లు ఉంటాయి. వీటిని సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇస్తారు.
- నిర్దేశిత గడువు లోగా విద్యార్థులు కంటెంట్ వీడియోలను చూడటంతో పాటు తమ అసైన్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
- ఒక్కో అసైన్‌మెంట్‌కు కనీసం 40శాతం మార్కులు తప్పనిసరిగా స్కోరు చేయాలి. తుది మూల్యాంకనం కోసం మొత్తం 4 అసైన్‌మెంట్‌లలో మూడింట్లో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.
- ఎనిమిది వారాల ఆన్‌లైన్ కోర్సు పూర్తయిన తర్వాత పాసైన విద్యార్థులకు ఈ-సర్టిఫికెట్‌లను పంపిస్తారు.