Navodaya 2025 Applications | ‘నవోదయ’లో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

Navodaya 2025 : ‘నవోదయ’లో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది

JNVST 2025: దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలివే..

Published :16 July 2024 22:00 IST

JNVST 2025-26 Applications | దిల్లీ: వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 653 జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2024) నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025 ఏప్రిల్‌ 12 (శనివారం) ఉదయం 11.30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో; 2025 జనవరి 18 (శనివారం)వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 16వరకు https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి

  • అర్హతలు: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
  • వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2013 నుంచి జులై 31, 2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.
  • ప్రవేశ పరీక్ష: జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్‌, లాంగ్వేజ్‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో నవోదయ అధికారిక వెబ్‌సైట్‌ https://cbseitms.rcil.gov.in/nvs/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.