cbse board exam results announced I సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

CBSE Class 10, 12 results: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Published : 13 May 2024 13:35 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఉదయం పన్నెండో తరగతి ఫలితాలను ప్రకటించిన బోర్డు.. తాజాగా పదో తరగతి రిజల్ట్స్‌ను ప్రకటించింది. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్‌, ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్‌ పొందొచ్చు. (CBSE class 10, 12 Results Announced)

10వ తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

పదో తరగతిలో మొత్తం 93.60శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2.12లక్షల మందికి 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30శాతం, బెంగళూరులో 99.26శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

12వ తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఇక, ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 91.52శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు రాణించారు. 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే.