Job Skills ఆఫర్ - అపాయింట్‌మెంట్ మధ్య ఏమేం నేర్చుకోవాలి?
ఉద్యోగుల ఎంపికలో ట్రెండ్ మారింది. ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చేసినట్లు కాదు. ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ లెటర్ మధ్య కొన్ని నైపుణ్యాలు నేర్చుకొనేవారివైపే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయ్..
Published : 09 July 2024 07:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=08072024
కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తే చాలు, ఆపై దర్జాగా ఉద్యోగంలో చేరిపోవచ్చనుకొనే రోజులు పోయాయ్.. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపికవ్వడం ఒక ఎత్తయితే.. ఆఫర్ లెటర్ (Offer Letter)ను అపాయింట్‌మెంట్ ఆర్డర్ (Oppointment Order)గా మార్చుకునేందుకు మరో ఆర్నెల్లో, ఏడాది పాటో శ్రమించాలనేది వాస్తవం. దీన్ని గుర్తించిన అభ్యర్థులు అందుకు కావలసిన నైపుణ్యాల (Skills)పై దృష్టి సారించి అంతిమ విజయం సాధిస్తున్నారు!
ఒకప్పుడు.. ఐటీ, కార్పొరేట్ కంపెనీలకు ఉద్యోగుల సంఖ్యాబలం అవసరంగా ఉండేది. ఒక కొత్త ప్రాజెక్టు తెచ్చుకోవాలంటే కంపెనీ చేతిలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన ఉద్యోగులే గాక అదనపు సిబ్బంది తగినంతగా ఉన్నారా? లేదా? అనేది ప్రాజెక్టు ఇవ్వబోయే కంపెనీ (క్లయింట్) వద్ద నిరూపించుకోవాల్సి వచ్చేది. అందుకే కంపెనీలు ఓవైపు కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆదాయ అవకాశాల కోసం అన్వేషిస్తూనే మరోపక్క ఫ్రెషర్లను దొరికినవారిని దొరికినట్టు తీసుకునేవి. తమ ఉద్యోగుల జాబితా పొడవును పెంచుకుంటుండేవి. కొత్త ప్రాజెక్టు వచ్చేవరకు వారిని బెంచ్‌పై (పని లేకుండా ఖాళీగా) ఉంచేవి. ఇప్పుడా ‘స్వర్ణ యుగం’ ముగిసింది. పరిణామ క్రమంలో మార్కెట్ కొత్తరూపును సంతరించుకొని నైపుణ్య శకానికి నాంది పలికింది.
అగ్నిపరీక్షను దాటి రావాలని..
కనీస నైపుణ్యాలను పరిశీలించి ప్రాంగణ నియామకాలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పటివరకు ఉద్యోగార్థిగా ఉన్న విద్యార్థి తమ ఉద్యోగిగా మారాలంటే అందుకు అవసరమైన నైపుణ్యాలు ఆర్జించేందుకు కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. దానికి తగ్గట్టు మార్గాలు చూపుతున్నాయి. ఆఫర్ లెటరే ఫైనల్ అనుకోకుండా అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకోవాలంటే నైపుణ్యాల అగ్నిపరీక్షను దాటి రావాలని నిర్దేశిస్తున్నాయి. అడుగుపెట్టగానే తాము అప్పగించే ప్రాజెక్టులో భాగస్వామిగా తొలిరోజు నుంచి ఇమిడిపోగల నైపుణ్యాలు కలిగిన అభ్యర్థికే ప్యాకేజీ లెటర్ అందిస్తున్నాయి. ఈ స్కిల్స్ అలవర్చుకోలేనివారు ఎంతకాలం నిరీక్షించినా అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకోలేరు.
ఈ కంపెనీల్లో ఉద్యోగం వస్తే జాక్‌పాట్ తగిలినట్లే!
ఆచితూచి ఎంపికలు
ఎడాపెడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దశ ముగిసి ఆచితూచి ప్రాంగణ ఎంపికలు జరిగే కాలంలోకి వచ్చేశాం. వధూవరుల ఎంపికకు తల్లి దండ్రులు సకల జాగ్రత్తలు తీసుకునేట్లుగానే.. ప్రస్తుతం ఐటీ ఇతర రంగాల కంపెనీలు అభ్యర్థుల ఎంపికలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఎంపికయినా కొంత వ్యవధి ఇచ్చి తమకు కావలసిన నైపుణ్యాల హారం వేసుకు వస్తేనే కంపెనీలు ద్వారాలు తెరుస్తున్నాయి. అంటే కంపెనీలకు కావలసింది గతంలోలాగా తలలు లెక్కించేందుకు వట్టి ఉద్యోగి కాదు, కంపెనీల తలరాత మార్చే గట్టి నైపుణ్యాలు కలవారే కావాలి!
మూడు వ్యూహాలు
కంపెనీల స్థాయిని బట్టి ఆఫర్- అపాయింట్‌మెంట్‌ల మధ్యకాలంలో అభ్యర్థి దాటుకుంటూ రావాల్సిన వారధిని నిర్మిస్తున్నాయి.
- ఉత్పత్తి ఆధారిత సంస్థలు ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ (పీపీఓ)లో భాగంగా ఇంటర్న్‌షిప్‌కు రమ్మంటున్నాయి. కంపెనీ స్థాయిని బట్టి నెలవారీ స్టైపెండ్‌ను అందిస్తూ ఆర్నెల్లో, ఏడాదో తమ కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయమంటున్నాయి. అభ్యర్థి నైపుణ్యాలను అనుదినం పరిశీలిస్తున్నాయి. అంటే ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ప్రాజెక్టులో చేరిన వెంటనే కంపెనీకి కావలసిన సేవలు అందించేయాలని కోరుకోరు. కేవలం ప్రాజెక్టులో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించగలగడం.. క్రమేపీ ఆ స్కిల్‌ను నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం, వేగంగా నేర్చుకొని ప్రాజెక్టు పని స్రవంతిలో (వర్క్ స్ట్రీమ్) ఇమిడిపోవడాన్ని అభ్యర్థి నుంచి కంపెనీలు ఆశిస్తున్నాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస, వేగంగా నేర్చుకోవడం (అడాప్టబిలిటీ) అనే లక్షణాలు అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో ప్రధానంగా చూస్తున్నాయి.
- సేవలందించే సంస్థలు మరోరకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఆఫర్ లెటర్ ఇచ్చాక ఆరు నెలల శిక్షణను అందిస్తున్నాయి. కంపెనీలోకి ప్రవేశించాక పనిచేయడానికి అవసరమైన స్కిల్స్ ప్యాకేజీని ఒక్కో నెల ఒక్కో మాడ్యూల్‌గా ఇస్తున్నాయి. శిక్షణలో భాగంగా ఆరునెలల పాటు ప్రతి నెలా ఇచ్చిన మాడ్యూల్‌ని విజయవంతంగా పూర్తిచేయాలి. కంపెనీ ప్రాజెక్టులకు అవసరమైన లాంగ్వే జ్‌లు, మెరుగుపరచుకోవాల్సిన కోడింగ్ నైపుణ్యాలతో పాటు అభ్యర్థి దృక్పథాన్ని నిర్దేశించే ‘వ్యవహార శైలిలో సర్దుబాటు’ (ఫ్లెక్సిబిలిటీ), బృందంలో ఇమిడిపోగల సరళత్వం, నేర్చుకోవడంపై గల ఆసక్తి, వేగంగా నేర్చుకోగలగడం, పనిలో సమస్యా పరిష్కార ధోరణిని కంపెనీలు ప్రతి నెలా పరిశీలిస్తుంటాయి. ఆరునెలల అగ్నిపరీక్షలో నిగ్గు తేలిన అభ్యర్థికే అపాయింట్‌మెంట్ లెటర్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
- 3 తృతీయ శ్రేణి కంపెనీలు ఈ బాదరబందీ ఏమీ లేకుండా ఆఫర్ లెటర్‌తో పాటు తమకే ఏ నైపుణ్యాలు కావాలో చల్లగా చెప్పి అందుకు గడువు చెబుతాయి. ఆ తర్వాతనే టచ్‌లోకి రమ్మంటాయి. ఈలోపు జావా స్క్రిప్ట్, పైతాన్‌లతో సహా 20 రకాల లాంగ్వేజీల్లో ఆ కంపెనీ వినియోగిస్తున్న లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం సాధించమని కోరవచ్చు. కోడింగ్‌లో కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకోమనవచ్చు.
అందువల్ల కోడింగ్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థల పోటీలో ర్యాంకు సాధిస్తే ఈ మూడు శ్రేణుల కంపెనీలూ విలువనిస్తాయి. కోడ్ షెఫ్, హ్యాకర్ ర్యాంక్, టాప్ కోడర్, కోడ్ విటా, స్వాన్ వంటి ప్రోగ్రామింగ్ ప్రమాణాలు సాధించిన ఉద్యోగార్థి నైపుణ్యాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి.
మరికొన్ని మెలకువలు
- శ్రేణి ఏదైనా ముందుగా మెచ్చిన కంపెనీలో నచ్చిన ఉద్యోగంలో ప్రవేశించాలని ఎవరికి మాత్రం ఉండదు? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, కేపీఎంజీ, జెస్ట్‌మనీ, జె.పి. మోర్గాన్, జూమ్ వంటి కంపెనీల్లో చోటుకోసం ఎవరు మాత్రం ప్రయత్నించరు? అయితే టెక్నికల్ రౌండ్‌లో కానీ, హెచ్.ఆర్. రౌండ్‌లో కానీ అడిగిన ఏ ప్రశ్నకైనా దీటుగా సమాధానం ఇవ్వగలిగే సాధన చేయాలి.
- డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌లో ఎటువంటి సమస్య ఇచ్చినా పరిష్కరించుకోగల సామర్థ్యం అవసరం.
- ఇచ్చిన అంశాల కాంపోనెంట్స్ ద్వారా ఉన్నతస్థాయిలో సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
- అభ్యర్థి తనకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలి. తనకు నిజమైన ఆసక్తిగల సాంకేతిక పరిజ్ఞానంలో లోతైన అవగాహన, దాని ఆధారంగా పనిచేయగల నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి.
- ఆపరేటింగ్ సిస్టమ్, డి.బి.ఎం.ఎస్, కంప్యూటర్ నెట్‌వర్క్స్ వంటి సాంకేతిక విషయాలతో పాటు టీమ్ బిల్డింగ్, టీమ్ లీడింగ్, డెసిషన్ మేకింగ్ వంటి హెచ్.ఆర్. అంశాలపై ఇచ్చే సవాళ్లను ఎదుర్కొనగలిగేలా సన్నద్ధం కావాలి.
ఇంటర్న్‌షిప్ ద్వారా ఇంతింతై...
- ఏదైనా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ ఉండి అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్ అవకాశం ఉంటే ప్రస్తుత తరుణంలో దానికి మించింది లేదు. ఆఫర్ చేతిలో ఉన్నా లేకపోయినా ఇంటర్న్‌షిప్ అనేది ఉద్యోగ సాధనకు అక్కరకు వచ్చే మార్గం. క్యాంపస్‌లో ఉండగా అన్ని కంపెనీలకూ వినియోగపడే సాధారణ నైపుణ్యాలు నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రవేశించబోయే ఉద్యోగం డిమాండ్ చేసే నైపుణ్యాలు ముందే తెలుసుకొని వాటిని నేర్చుకునే అవకాశం ఉండటం వేరు.
- సరిగ్గా ఉద్యోగంలో చేరాక ఏ స్కిల్ సెట్ అవసరమో వాటినే ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకునే వీలుంటుంది. ఉద్యోగంలో తప్పులు చేస్తే కంపెనీకి నష్టం వాటిల్లుతుంది. అదే ఇంటర్న్‌షిప్‌లో పొరపాట్లు దొర్లినా వెంటనే పర్యవేక్షకులు సరిదిద్దుతారు.
- కంపెనీలు సాధారణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపికయినవారిలో కొందరికి 8వ సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నాయి. దీనివల్ల తాము చేయబోయే ఉద్యోగ నైపుణ్యాలను ముందే నేర్చుకునే వీలు దొరుకుతోంది.
- కొన్ని సంస్థలు ఆఫర్ లెటర్ ఇచ్చిన అభ్యర్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో నైపుణ్యాలు పెంచే కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులను ఈ కోర్సులు నేర్చుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ కోర్సుల్లో భాగంగా టెస్టులు నిర్వహిస్తుంటారు. వీటిలో అభ్యర్థులు సాధిస్తున్న స్కోరు ఆధారంగా వారి ప్రావీణ్యాలను అంచనా వేస్తుంటారు. అసలు వీటిలో పాల్గొనకుండా నిరాసక్తిగా ఉన్న అభ్యర్థులనూ కంపెనీ హెచ్.ఆర్. విభాగం ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది.
- ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీ నుంచే ఇంటర్న్‌షిప్ రాని అభ్యర్థులు ఇంటర్న్‌శాల, లింక్డ్ ఇన్ లాంటి వేదికల్లో అవకాశాలను అన్వేషించవచ్చు.
- యస్.వి. సురేష్,సంపాదకుడు, ఉద్యోగ సోపానం