Decision Making: తొందరపడుతున్నారా? ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
విద్యాసంవత్సరం మొదలుకాబోతోంది.. కోర్సుల్లో చేరేటప్పుడు తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
Published : 05 June 2024 16:02 IST
https://results.eenadu.net/news.aspx?newsid=05062024
ఇంటర్నెట్ డెస్క్: విద్యా సంవత్సరం మొదలవుతుందంటే చాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఒకటే హడావుడి, ఆందోళన. ఏ కాలేజీలో చేరాలి? ఏ కోర్సు తీసుకుంటే మేలు? హాస్టల్‌లో ఉండాలా? ఇంటి నుంచే తిరగాలా? కాలేజ్ బస్సా.. బైక్ మీదే వెళ్లి రావొచ్చా? ఇలా.. ఎన్నెన్నో ప్రశ్నలు మెదళ్లను తొలిచేస్తుంటాయి. అయితే, ఈ విషయాల్లో తొందరపడితే ఇబ్బందిపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మరి నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమెలా? ఏయే అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి?
- వర్తమానంలో తీసుకొనే నిర్ణయాలపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుందనడంలో సందేహంలేదు. ముఖ్యంగా విద్యార్థి దశలో తీసుకునే నిర్ణయాలు మొత్తం జీవితాన్నే ప్రభావితం చేస్తాయి. చదవాలనుకునే కోర్సులు, అందుకు వెళ్లాల్సిన కొత్త ప్రదేశాలు, ఆర్థిక వ్యవహారాలు.. ఇలాంటి నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడమే ఉత్తమం.
- ఏ మార్గాన్ని ఎంచుకొనేటప్పుడైనా సరే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ‘ఇది నాకు నచ్చిందా, నేను చేయగలనా?, అసలు ఇది ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే ప్రయోజనాలేంటి? చేయకపోతే జరిగే నష్టమేంటి? తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది?’ ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకుని సమాధానాలు తెలుసుకుంటే నిర్ణయంలో కచ్చితత్వం ఉంటుంది.
- ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సరైన సమాచార సేకరణ అత్యంత అవసరం. పూర్తిగా తెలియకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు రెండు కాలేజీల్లో ఏది ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్నప్పుడు కాస్త ఆగి.. కోర్సు నాణ్యత, బోధనా వసతులు, క్యాంపస్ వాతావరణం, ఫీజు, ఇంటి నుంచి దూరం, వసతి - రవాణా సౌకర్యం, ప్రాంగణ ఎంపికలకు వస్తున్న కంపెనీలు, గత కొన్నేళ్లలో సాధించిన ప్యాకేజీలు.. ఇలా అన్ని వివరాలూ తెలుసుకుంటే పోలిక చూసుకుని సరైనది ఎంపిక చేసుకోగలం.
- ఏదైనా ముఖ్యమైన నిర్ణయం అనుకున్నప్పుడు తల్లిదండ్రుల, అధ్యాపకుల, శ్రేయోభిలాషుల అభిప్రాయాలు తీసుకోవడం శ్రేయస్కరం. అలాగని అందరూ చెప్పినవన్నీ అలాగే పాటించాలని కాదు. చివరిగా మనకు నచ్చిందే చేసినా.. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనల్ని తీసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవడమూ సులవవుతుంది.