NEET 2026 | నీట్ (యూజీ) దరఖాస్తులు షురూ.. ఈ కొత్త రూల్స్ తెలుసా?
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (NEET UG 2026) పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది.
By Education News Team
Updated :08 Feb 2026 15:32 IST
https://results.eenadu.net/education-news/NEET-UG-2026-Registration-starts
దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (NEET UG 2026) పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం ప్రకటించింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
దరఖాస్తులో ఈ కొత్త రూల్స్ తెలుసా?
- ఆధార్ ఈ-కేవైసీ: అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీని ప్రవేశపెట్టారు.
- లైవ్‌ఫొటో: ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫొటో క్యాప్చర్ చేయడం తప్పనిసరి. తద్వారా సిస్టమ్ మీ లైవ్ ఫొటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది.
- ఒకవేళ మీ లైవ్ ఫొటో ఆధార్‌తో సరిపోలకపోతే.. అందుకు వీలుగా మీ గుర్తింపును నిర్ధారించేలా తగిన ధ్రువీకరణపత్రాలను అదనంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సిటీ సెలక్షన్: అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో అందించిన ప్రస్తుత/శాశ్వత అడ్రస్ ఆధారంగానే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుం ఎంతంటే?
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000, 011-69227700 ఫోన్ నంబర్లు లేదా neetug2026@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఎన్టీఏ అధికారులు సూచించారు. పరీక్ష సరళి, సిలబస్, ఇతర పూర్తి వివరాలతో కూడిన బుక్లెట్ కోసం క్లిక్ చేయండి.