NCET 2026 | ఐఐటీ/ఎన్‌ఐటీల్లో బీఈడీ చేస్తారా? దరఖాస్తులు మొదలయ్యాయ్

NCET 2026 | ఐఐటీ/ఎన్‌ఐటీల్లో బీఈడీ చేస్తారా? దరఖాస్తులు మొదలయ్యాయ్

ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బీఈడీ చేయాలన్న ఆసక్తి మీకు ఉందా?

Eenadu icon
By Education News Team Published : 13 Feb 2026 16:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో బీఈడీ చేయాలన్న ఆసక్తి మీకు ఉందా? అయితే, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ITEP)కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 17న (శుక్రవారం) జరిగే నేషనల్‌ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (NCET 2026)కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు మార్చి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఎన్‌టీఏ (NTA) తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో ఈ ప్రవేశ పరీక్ష (సీబీటీ విధానంలో) నిర్వహించనున్నారు. 

ఇంటర్‌, తత్సమాన విద్యార్హతతో బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సుల్లో చేరొచ్చు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ చేపట్టి ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు రుసుం జనరల్‌ అభ్యర్థులకు రూ.1200, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్‌లకు రూ.650 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ రూపంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఏయే విద్యాసంస్థలు అందిస్తున్నాయి? అక్కడ ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి? అందించే కోర్సులేంటీ? ఈ ప్రవేశ పరీక్ష సరళి ఎలా ఉంటుంది? తదితర పూర్తి వివరాలను ఈ బుక్‌లెట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000, 011-69227700 నంబర్‌కు లేదా ncet@nta.ac.inకు ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.