NEET-UG 2026 | నీట్ దరఖాస్తులకు ఇదే ఆఖరి ఛాన్స్.. మళ్లీ పొడిగించం: ఎన్‌టీఏ
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (NEET UG 2026) పరీక్షకు దరఖాస్తుల గడువును ఎన్‌టీఏ (NTA) పొడిగించింది.
By Education News Team
Updated :09 Mar 2026 15:22 IST
https://results.eenadu.net/education-news/NEET-ug-2026-applications-deadline-extended
దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)- యూజీ (NEET UG 2026) పరీక్షకు దరఖాస్తుల గడువును ఎన్‌టీఏ (NTA) పొడిగించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం మార్చి 8వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ.. తాజాగా ఆ గడువును తాజాగా మార్చి 11వ తేదీ వరకు పొడిగించింది. దీంతో విద్యార్థులు బుధవారం (మార్చి 11) రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుమును అదేరోజు రాత్రి 11.50గంటల వరకు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. 11లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని, గడువును మళ్లీ పొడిగించే అవకాశం లేదని వెల్లడించింది. మే 3న తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో నీట్ రాత పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
దరఖాస్తులో ఈ కొత్త రూల్స్ తెలుసా?
- ఆధార్ ఈ-కేవైసీ: అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీని ప్రవేశపెట్టారు.
- లైవ్‌ఫొటో: ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫొటో క్యాప్చర్ చేయడం తప్పనిసరి. తద్వారా సిస్టమ్ మీ లైవ్ ఫొటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది.
- ఒకవేళ మీ లైవ్ ఫొటో ఆధార్‌తో సరిపోలకపోతే.. అందుకు వీలుగా మీ గుర్తింపును నిర్ధారించేలా తగిన ధ్రువీకరణపత్రాలను అదనంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సిటీ సెలక్షన్: అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో అందించిన ప్రస్తుత/శాశ్వత అడ్రస్ ఆధారంగానే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుం ఎంతంటే?
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000, 011-69227700 ఫోన్ నంబర్లు లేదా neetug2026@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఎన్‌టీఏ అధికారులు సూచించారు. పరీక్ష సరళి, సిలబస్, ఇతర పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్ కోసం క్లిక్ చేయండి.