Digital Library | ఒక్క క్లిక్‌తో అర చేతిలో కోట్లాది పుస్తకాలు!

Digital Library | ఒక్క క్లిక్‌తో అర చేతిలో కోట్లాది పుస్తకాలు!

పాఠశాల, కళాశాల విద్యార్థులే కాదు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో పాటు అన్ని వర్గాల పాఠకుల కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Eenadu icon
By Education News Team Updated :14 Dec 2025 17:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాఠశాల, కళాశాల విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో పాటు అన్ని వర్గాల పాఠకుల కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లైబ్రరీ(National Digital Library )ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో యువత, అన్ని తరగతుల విద్యార్థులకు ఉపయోగపడేలా కోట్లాది సంఖ్యలో అకడమిక్, పోటీ పరీక్షల పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌, పాత ప్రశ్నపత్రాలు, అనుబంధ పుస్తకాలతో సహా అన్నీ లభిస్తున్నాయి. అలాగే, కొన్ని దశాబ్దాల కాలం నుంచి దిన, వార, పక్ష పత్రికలను సైతం అధికారులు పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఈ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించింది. 

వివిధ భారతీయ భాషల నుంచి అవసరమైన, ప్రముఖమైన పుస్తకాలనూ ఇందులో భద్రపరిచారు. పుస్తకం, సబ్జెక్టు రచయిత.. వంటి వివరాల  ఆధారంగా విద్యార్థులు తమకు కావాల్సినవి ఇందులో వెతకవచ్చు. ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారికి పూర్తిస్థాయిలో ఉపకరించేలా డిజిటల్‌ లైబ్రరీని రూపొందించారు. ఇందులో వీడియోలనూ అందుబాటులో ఉంచారు. పాఠశాల, కళాశాల, ఇంజినీరింగ్, వైద్యవిద్య, న్యాయవిద్య, సాహిత్యం, సంస్కృతం ఇలా అన్ని స్టడీ మెటీరియల్‌ను అన్ని భాషల్లో నిక్షిప్తం చేశారు. ప్రధానంగా పోటీ పరీక్షలైన ఐఐటీ జేఈఈ, నీట్‌, గేట్‌, జామ్‌ వంటి పోటీ పరీక్షలకు మెటీరియల్‌తో పాటు స్వయం పోర్టల్ ద్వారా అందించే కోర్సులను సైతం ఇక్కడి నుంచి యాక్సెస్‌ చేసుకోవచ్చు. 

తొలుత ఎన్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ను https://ndl.iitkgp.ac.in/ సందర్శించండి. హోమ్‌పేజీలో కనిపించే choose your preference courseలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, కెరీర్‌ డెవలప్‌మెంట్‌, రీసెర్చి, పేరంట్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌, జ్యుడీషియల్‌ రీసోర్సెస్‌, కల్చరల్‌ ఆర్కైవ్స్‌, న్యూస్‌పేపర్‌ ఆర్కైవ్స్‌లలో మీకు అవసరమైన అంశాన్ని ఎంచుకొని చదువుకోవచ్చు. ఇందులో వీడియోలను సైతం పొందుపరిచారు. నేషన్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌  ఇండియా (NDLI) యాప్‌ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకొని మీకు అవసరమైన పుస్తకాలను ఎంచుకొని ఆస్వాదించవచ్చు.