Job Skills | ఉద్యోగం రావాలంటే.. ఈ స్కిల్స్‌ మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి!

Job Skills: ఉద్యోగం రావాలంటే.. ఈ స్కిల్స్‌ మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి!

ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీలు కేవలం చదువు, సాంకేతిక నైపుణ్యాలే కాదు.. అభ్యర్థులను పరీక్షించేటప్పుడు ఇంకొన్ని స్వాభావికమైన లక్షణాల్నీ చూస్తున్నాయి. అవేంటంటే?

Published : 16 June 2024 20:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో జాబ్‌ రావాలంటే కేవలం విద్యార్హతలుంటే సరిపోదు.. తగిన సాంకేతిక నైపుణ్యాలూ కావాలి. వీటికితోడు కొన్ని స్వాభావికపరమైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల పట్ల కంపెనీలు ఇంటర్వ్యూ సమయంలో అమితమైన ఆసక్తి కనబరుస్తున్నాయి. కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ వేసి ఆహ్వానించే అలాంటి నైపుణ్యాలు మీలోనూ ఉన్నాయా? చెక్‌ చేసుకోండి!

  • కొత్తవి నేర్చుకుంటున్నారా?: ఉన్నత చదువులు పూర్తికాగానే జాబ్‌ వచ్చేస్తుందనుకొనే రోజులు పోయాయి. తగిన నైపుణ్యాల్లేకపోతే ఏళ్ల పాటు చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే నిలదొక్కుకోగలం. అందుకు నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయితేనే కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలుంటాయి. 
  • ఆసక్తిగా ఉంటారా?: ప్రపంచంలో వస్తోన్న పోకడలకనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకత ఉండాలి. నిత్యనూతనంగా ఉంటూ, కొత్తగా ఆలోచించే నైపుణ్యాలున్నవారికే కంపెనీలు ఉద్యోగాల్లో పెద్దపీట వేస్తున్నాయి. అలాంటి మానవ వనరులకు ఎప్పుడైనా గిరాకీ ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూ సమయంలో మీలో ఉన్న ఈ నైపుణ్యాల్ని ఉదాహరణలతో చెప్పేలా వ్యవహరించండి. 
  • ఎదగాలనే కోరిక ఉందా?: కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలనే కోరిక ఉంటే సరిపోదు. అందుకు కసి, నిరంతర పరిశ్రమతోడైతేనే  సాధ్యం. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని అధిగమించే తత్వాన్ని అలవర్చుకోండి. జీవితంలో ఎదగాలనే కోరికతో పాటు పట్టుదల, ఓపిక, పోటీతత్వం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే గుణాన్ని పెంపొందించుకోవాలి. 
  • టీమ్‌ను నడిపించగలరా?: లైఫ్‌లో విజయం సాధించాలని అందరూ అనుకుంటారు. కానీ, అనుకున్న కలల్ని కొందరు మాత్రమే నిజం చేసుకోగలుగుతారు. మీ అభిప్రాయాన్ని ఎవరైనా తిరస్కరిస్తే వారిపట్ల కోపం/పగతో రగిలిపోతే మీరు ఎదగలేరు. మీ అభిప్రాయంతో ఏకీభవించనివారిపట్ల కోపం/ప్రతీకారేచ్ఛతో ఉంటే మీరు టీమ్‌ను ముందుకు నడిపించలేరు. నలుగురితో కలుపుగోలుగా వ్యవహరించే వ్యవహార ధోరణి పెంపొందించుకుంటేనే టీమ్‌ లీడర్‌గా ఎదిగే ఛాన్స్‌ ఉంటుంది.
  • వేరే కోణంలో ఆలోచిస్తున్నారా?: ఏ విషయాన్నయినా సరే.. క్రిటికల్‌గా ఆలోచించాలి. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా వ్యవహరిస్తే కెరీర్‌లో రాణించలేరు. ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు కేవలం మీ దృష్టితోనే కాకుండా అవతలి వారి దృష్టితోనూ ఆలోచించే గుణాన్ని అలవర్చుకోవాలి.  అప్పుడే, సమస్య పరిష్కారం దిశగా ఆలోచించే సామర్థ్యం మీకు అలవడుతుంది.