Book Reading Tips | పుస్తక పఠనం అలవాటవ్వాలా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!!

Book Reading Tips: పుస్తక పఠనం అలవాటవ్వాలా? ఈ చిట్కాలు పాటిస్తే సరి!

ఈ డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకొచ్చాక పుస్తకాలు చదవాలన్న ఆసక్తి కొరవడుతోందనేది చేదు నిజం. పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకొనేందుకు కొందరు కొన్ని బుక్స్‌ ముందు పెట్టుకొని కూర్చున్నా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతున్నారు. అలాంటివారు ఈ చిట్కాలు ట్రైచేసి చూడండి.

Published : 02 July 2024 23:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుస్తకాలు చదవడం చాలా మంచి అలవాటు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, పద సంపద పెరగడంతో పాటు మనుషుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. అందుకే పుస్తకాలు చదివేవాళ్లు జీవితాన్ని బాగా అర్థం చేసుకోగలరని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఈ డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకి వచ్చాక పుస్తకాలు చదవాలన్న ఆసక్తి కొరవడుతోందనేది చేదు నిజం. కొందరు దీన్ని అలవాటు చేసుకొనేందుకు పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చున్నా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలనుకొనేవారు ఈ చిట్కాలు ట్రైచేసి చూడండి.

నచ్చిన అంశంపై బుక్స్‌ ఎంచుకోండి

పుస్తక పఠనం అలవాటవ్వాలంటే తొలుత మీకు నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాన్ని మాత్రమే ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు మీకు చరిత్ర అంటే ఇష్టమనుకోండి.. ఆ పుస్తకాలకే  ప్రియారిటీ ఇవ్వండి. క్రీడలు ఇష్టమైతే వాటికి సంబంధించిన పుస్తకాలు, క్రీడాకారుల ఆత్మకథలను ఎంచుకోండి. మీకు నచ్చిన అంశంపై పుస్తకాలను చదవడం వల్ల ఆసక్తి పెరగడంతో పాటు మీకు తెలియకుండానే పుస్తక పఠనంలో లీనమవుతారు. అలా నచ్చిన పుస్తకాల్ని చదవడం వల్ల పుస్తక పఠనం అలవాటైపోతుంది. ఆ తర్వాత మీ అభిరుచులను బట్టి ఇతర పుస్తకాలూ చదువుకోవచ్చు. 

తక్కువ పేజీలున్న బుక్స్‌తో మొదలుపెట్టండి..

చదవడం ప్రారంభించిన మొదట్లోనే ఎక్కువ పేజీలు ఉన్న భారీ పుస్తకాన్ని ఎంచుకోవద్దు. అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. ఇన్ని పేజీలా? ఎప్పుడు చదవాలి? అసలు చదవగలనా? ఇలాంటి అనేక సందేహాలు వస్తుంటాయి. దీంతో శ్రద్ధ పెట్టలేరు. అందువల్ల, తక్కువ పేజీలుండే పుస్తకాలనే ఎంచుకోండి. వాటిని చూడగానే తొందరగా చదివేయొచ్చనే ధీమా మీలో కలుగుతుంది. 400 పేజీలుండే పుస్తకాన్ని పూర్తి చేయడం కోసం అయిష్టంగా రోజుల తరబడి కుస్తీ పట్టే బదులు.. ఓ వంద పేజీలుండే పుస్తకాన్ని తక్కువ సమయంలో అవలీలగా పూర్తి చేసేయొచ్చు. ఒక పుస్తకం చదవడం పూర్తి చేస్తే మరో పుస్తకం చదవాలన్న ఆసక్తి దానంతట అదే ఏర్పడుతుంది. అలా చిన్న పుస్తకాలనే తీసుకొని చదువుతూ ఉంటే.. పుస్తక పఠనం అలవాటుగా మారిపోతుంది.

కొంత సమయం కేటాయించండి

ప్రతిఒక్కరికీ రోజువారీ పనులు ఎలాగూ ఉండేవే. పుస్తక పఠనం కోసం కాస్త సమయం కేటాయించేందుకు ట్రై చేయండి. రోజుకు కనీసం పది నిమిషాలు చదివినా చాలు. ఇందుకోసం ప్రత్యేకించి మీ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్ర లేచినప్పుడు, పడుకునే ముందు, మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఇలా రోజులో ఏదో ఒక సమయంలో కనీసం పది నిమిషాలు చదవండి. అలాగే, ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎంచక్కా ఒక పుస్తకం వెంట తీసుకెళ్లండి.

రోజుకు 10 పేజీలే..!

మీకు నచ్చిన పుస్తకంలో ఎక్కువ పేజీలు ఉన్నాయనుకుంటే.. రోజుకు 10 పేజీలే చదవండి. సాధారణంగా అరగంటలో సులువుగా 10 పేజీలు చదవొచ్చు. కాబట్టి, రోజుకు 10 పేజీల చొప్పున చదివినా మీరు పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరో మీకంటూ ఓ క్లారిటీ వచ్చేస్తుంది. పుస్తకాల్లో పేజీల సంఖ్య సరాసరి 200 పేజీలు ఉంటాయట. ఈ లెక్కన మీరు ఏడాదిలో 18 పుస్తకాలు చదవగలరు.

చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి

పుస్తకాన్ని ఏకకాలంలోనే పూర్తి చేసేయాలి. కొనుకున్న లేదా లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలన్నీ తొందరగా చదవేయాలి.. అని సంకల్పించుకోవద్దు. నిదానమే ప్రదానం అన్నట్లు.. పుస్తకం పఠనం అలవాటయ్యే వరకు రోజుకు కొంత సమయం చదువుతూ.. నెలలో కనీసం ఒకటి రెండు పుస్తకాలైనా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. అలాగైతే.. మీకు నచ్చిన పుస్తకాలను మీరు పెట్టుకున్న లక్ష్యం కన్నా ముందే పూర్తి చేయగలరు.

వృథా సమయం.. పుస్తక పఠనానికి

రోజులో జీవితాన్ని నడిపించడానికి చేసే పనులు కొన్ని ఉంటే.. కాలక్షేపానికి చేసే పనులు మరికొన్ని ఉంటాయి. టీవీ చూడటం, ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటం, సోషల్‌మీడియా చెక్‌ చేయడం, బ్రౌజింగ్‌.. ఇలా అనేకం వంటివి. వీటి వల్ల అస్సలు సమయమే తెలియదు. అందుకే వీటికి కేటాయించే సమయంలో కొంత పుస్తకం చదవడానికి కేటాయించడానికి ప్రయత్నించండి.  కేవలం పుస్తకాలనే కాదు.. ఆన్‌లైన్‌లోనూ ఈ-బుక్స్‌ చాలా అందుబాటులో ఉన్నాయి. అవి చదివినా మంచిదే.

నోట్స్‌ రాసే ప్రయత్నం వద్దు

కొందరు పుస్తకాలు చదువుతూ చదువుతూ నచ్చిన అంశాన్ని, వ్యాక్యాలను నోట్స్‌ రాసుకుంటుంటారు. నిజానికి ఇది మంచి విషయమే. కానీ, ఇప్పుడిప్పుడే పుస్తక పఠనం అలవాటు చేసుకునే వారు నోట్స్‌ రాసే ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే నోట్స్‌ రాసుకోవడం చదువుకు అంతరాయంగా అనిపిస్తుండొచ్చు. అలాగే, పుస్తకం చదవడం ప్రారంభించిన ప్రతిసారీ నోట్స్‌ కూడా రాసుకోవాలంటే కాస్త భారంగానే అనిపిస్తుండొచ్చు. దీంతో అసలు పుస్తకమే చదవకపోతే సరిపోతుంది కదా అనే భావనకు వచ్చేస్తారు. అందువల్ల ఇప్పుడే నోట్స్‌ రాయకండి. చిన్న పుస్తకాలను ముందు సాఫీగా చదివేయండి.

నిఘంటువు సాయంతో..

మీరు చదివే తెలుగు లేదా ఇంగ్లిష్‌.. ఇతర భాషా పుస్తకాలు చదువుతున్న సమయాల్లో కొన్ని కొత్త పదాలు తగులుతుంటాయి. వీటిని వదిలేయకుండా అర్థాలను తెలుసుకొనే ప్రయత్నం చేయండి. ఆ పదాల కోసం వెతికేందుకు నిఘంటువుల సాయం తీసుకోండి. పదాలకు అర్థాలు తెలిసిన వెంటనే ఒక పుస్తకంలో రాసుకుంటే పద సంపద పెంచుకోవచ్చు. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల్లోనూ నిఘంటువులను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మరీ మంచిది. తెలుగులో ఆంధ్రభారతి, ఇంగ్లిష్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వంటి నిఘంటువుల బాగా ఉపయోగపడతాయి.