GATE 2026 | గేట్ 2026 రాస్తున్నారా? అభ్యర్థులకు కీలక సూచనలివే!
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్షలకు ఐఐటీ గువాహటి ( IIT Guwahati) అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
By Education News Team
Updated :04 Feb 2026 18:07 IST
https://results.eenadu.net/education-news/key-Guidelines-for-GATE-2026-candidates
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్షలకు ఐఐటీ గువాహటి ( IIT Guwahati) అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అడ్మిట్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. వాటిపై ఉన్న వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ జాతీయ స్థాయి పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలివే..
- అడ్మిట్ కార్డులో ఇచ్చిన రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట లేదా గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొనేలా ప్లాన్ చేసుకోండి.
- గేట్లు మూసివేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రవేశానికి ముందే బయోమెట్రిక్, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ వంటివి పూర్తి చేస్తారు.
- ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గనక స్క్రీన్‌పైనే వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. అందువల్ల పరీక్షా హాలులోకి వ్యక్తిగత కాలిక్యులేటర్లు తీసుకెళ్లడం నిషిద్ధం.
- మొబైల్ ఫోన్‌లు, వ్యాలెట్‌లు, వాచ్‌లతో పాటు ఏ రకమైన ఎలక్ట్రానిక్ /కమ్యూనికేషన్ పరికరాలనూ లోపలికి అనుమతించరు. వీటితో పాటు పుస్తకాలు, కాగితాలు, పెన్/పెన్సిల్ బాక్స్/పౌచ్ వంటి వస్తువులకూ నో ఎంట్రీ.
- ఒకవేళ ఎవరైనా ఫిజికల్ కాలిక్యులేటర్ లేదా ఎలక్ట్రానిక్ వాచ్, మొబైల్‌ఫోన్ (స్విచాఫ్ మోడ్) వంటివి తీసుకెళ్లినట్లు గుర్తిస్తే వారిని పరీక్షా నిబంధనల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ అభ్యర్థులను గేట్ పరీక్షకు అనర్హులుగా ప్రకటించే అవకాశమూ ఉండొచ్చు.
- దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ గేట్ పరీక్షను ఏటా నిర్వహిస్తుంటారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 19న విడుదల చేస్తారు.