UPSC Civils Topper | ఈ డాక్టర్.. ‘సివిల్స్’ టాపర్
సివిల్స్ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి(Anuj Agnihotri) అద్భుత విజయం సాధించారు. అత్యంత కష్టమైన ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటారు.
By Education News Team
Updated :06 Mar 2026 20:50 IST
https://results.eenadu.net/education-news/UPSC-Topper-Anuj-Agnihotri-happy-on-his-success
ఇంటర్నెట్ డెస్క్: సివిల్స్ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి(Anuj Agnihotri) అద్భుత విజయం సాధించారు. అత్యంత కష్టమైన ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటారు. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఈ 26 ఏళ్ల వైద్యుడు.. సివిల్స్‌లో మూడో ప్రయత్నంతో అదరగొట్టారు. అనూజ్ సాధించిన అపూర్వ విజయంతో ఆయన ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తంచేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రోజూ సగటున 8గంటలు చదివా..!
సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో టాపర్‌గా నిలవడంపై అనూజ్ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ప్రేరణను చెక్కుచెదరనీయొద్దని, కష్టపడి పనిచేస్తే.. ఏదో ఒక రూపంలో విజయం వరిస్తుందని సూచించారు. సివిల్స్ ప్రిపరేషన్‌కు ప్రత్యేకంగా కఠినమైన షెడ్యూల్‌ను తాను అనుసరించలేదని, పరిస్థితిని బట్టి చదివినట్లు వెల్లడించారు. ఆ విధంగా సగటున రోజుకు సుమారు 8గంటల పాటు చదివినట్లు తెలిపారు.
స్వీయ క్రమశిక్షణ.. పట్టుదలతో..
అనూజ్‌కు ఇంతగొప్ప విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదు. 2023లో మొదటి ప్రయత్నంలో దిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్(DANICS)కు ఎంపికైన ఆయన.. ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. స్వీయ క్రమశిక్షణ, పట్టుదలతో ప్రిపరేషన్‌ను కొనసాగించి సివిల్స్‌లో సత్తా చాటారు. కేవలం ఆన్‌లైన్ కోచింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడి ప్రిపరేషన్ కొనసాగించారు. ఇంటర్వ్యూ కోసం దిల్లీలోని ఓ సంస్థలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అనూజ్‌ది సాధారణ కుటుంబమే. అతడి తండ్రి కోటాలోని అణువిద్యుత్ ప్లాంట్‌లో పనిచేస్తుండగా.. తల్లి గృహిణి.
అందుకే సివిల్స్ వైపు..
అనూజ్ అగ్నిహోత్రి రాజస్థాన్‌లోని కోటా సమీపంలో రావత్‌భట పట్టణంలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా అక్కడే కొనసాగగా.. వైద్య విద్య కోసం జోధ్‌పుర్ వెళ్లారు. ఎయిమ్స్- జోధ్‌పుర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మెడికల్ ట్రైనింగ్‌లో ఉండగానే సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లు ఓ మాక్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అయితే, వైద్యం సంతృప్తికరమైన వృత్తి అయినప్పటికీ.. పరిపాలన, ప్రజాసేవ అనేది విభిన్నరంగాల్లో పని చేసేందుకు వీలు కల్పించే గొప్ప అవకాశంగా తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.