Tips for Exam Revision| విద్యార్థులకు ‘పరీక్షా’ సమయం.. రివిజన్‌కు టిప్స్ ఇవిగో!
జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా జనవరి 21న ప్రారంభమైన ఈ జాతీయ స్థాయి పరీక్షలు ఈ నెల 29వరకు కొనసాగనున్నాయి.
By Education News Team
Updated :22 Jan 2026 18:09 IST
https://results.eenadu.net/education-news/JEE-Main-2026-revision-tips
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు కొనసాగుతున్నాయి. త్వరలో గేట్, నీట్, ఇతర పోటీ పరీక్షలతో పాటు వార్షిక పరీక్షలూ ప్రారంభం కానున్నాయి. అత్యంత కీలకమైన ఈ పరీక్షా కాలంలో రివిజన్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే చదివిన వాటిపై దృష్టిపెట్టడం అవసరమంటున్నారు నిపుణులు. పరీక్షల సన్నద్దతలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించేలా రివిజన్ కోసం విద్యార్థులకు నిపుణులు సూచిస్తున్న కొన్ని మెలకువలు ఇవిగో!
- పరీక్షకు ముందు పాఠ్య పుస్తకాలకు బదులుగా గతంలో తయారు చేసుకున్న షార్ట్‌నోట్స్, ఫార్ములా షీట్లను ఒకసారి పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ముఖ్యమైన ఫార్ములాలు, రియాక్షన్లు, టేబుల్స్‌తో పాటు థీరమ్స్, షార్ట్‌కట్ మెథడ్స్ ఉంటే రివైజ్ చేసుకోండి. అలాగే, అధిక వెయిటేజీ ఉన్న చాప్టర్లు, తరచూ అడిగే పాఠ్యాంశాలపై ఫోకస్ పెట్టండి.
- జేఈఈ మెయిన్, గేట్ వంటి పోటీ పరీక్షలకు మాక్ టెస్టులతో పాటు పాత ప్రశ్నపత్రాలనూ ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్ష సరళి అర్థమవుతుంది. మాక్ టెస్టుల్లో మీరు చేసే పొరపాట్లను జాగ్రత్తగా విశ్లేషించుకొని ఏయే టాపిక్స్‌లో బలహీనంగా ఉన్నారో గుర్తించడం, రివిజన్ సమయంలో వాటిపై ఫోకస్ పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.
- గత రెండు మూడేళ్లలో అడిగిన ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా సరళిపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. గతేడాది జరిగిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నల్ని ఓసారి చూసుకుంటే ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందో కూడా అవగతమవుతుంది.
- పరీక్ష సమయంలో ప్రశ్నల ఎంపిక నైపుణ్యాలను పెంచుకొనేందుకు వీలుగా పలు చాప్టర్ల నుంచి మిశ్రమ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. పరీక్ష సమయంలో ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ఒక ప్లాన్ రూపొందించుకోండి.
- పరీక్షల ఒత్తిడిలో నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. తగినంత నీరు తాగండి. తేలికైన ఆహారం తీసుకోండి. మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకొనేందుకు కనీసం 6-7గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే, ఎప్పటికప్పుడు చిన్న చిన్న విరామాలు తీసుకొని మీ రివిజన్ కొనసాగిస్తే విజయం మీదే!